పుట:Mana-Jeevithalu.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
211
మనస్సుకి వ్యాపకం

పువ్వులు, ఇంకా రకాలు. దారం ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో రకరకాల పువ్వులు ఏరుతాడు. ఒక చేతిలో దారం చురుకుగా మెలిక తిరుగుతూ, రెండో చేతిలో పువ్వుల్ని చకచకా కట్టేస్తుంది. పూలగుత్తులు తయారవుతాయి. తన చేతులకేసి అతడు ధ్యానం చూపించటమే లేదు. కళ్లు ఇటూ అటూ తిరుగుతూ వచ్చేపోయే వాళ్లని చూస్తూ ఉంటాయి. మధ్యమధ్య ఎవరినైనా గుర్తుపడితే చిరునవ్వు నవ్వుతాయి. మళ్లీ చేతుల వైపు తిరుగుతాయి, మళ్లీ ఇటూ అటూ తిరుగుతాయి. ఇంతలోనే ఇంకో కుర్రవాడు వచ్చి చేరాడు అతనితో. వాళ్లు కలిసి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. కాని, వాళ్ల చేతులు వాటి పనిని మాత్రం మానలేదు. ఇప్పుడు కట్టిన పువ్వుల పోగు పెద్దదయింది. కాని, అవి అమ్మటానికింకా వేళ కాలేదు. అ కుర్రవాడు ఆపేసి, లేచి ఎక్కడికో వెళ్లాడు. కాని తొందరగానే తిరిగి వచ్చాడు, తన కన్న చిన్న కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని. తమ్ముడు కావచ్చు. మళ్లీ తనకిష్టమైన పనిని మొదలుపెట్టాడు సునాయాసంగా, గబగబా. ఇప్పుడు జనం కొనటానికి వస్తున్నారు - ఒక్కొక్కరో, గుంపులుగానో. నిత్యంవచ్చి అతని దగ్గర కొనే వాళ్లయి ఉండాలి, ఎందుకంటే, చిరునవ్వుతో ఏవో మాటలాడు కున్నారు. ఆ తరవాత ఒక గంట సేపటివరకూ అతడు అక్కణ్ణించి కదల్లేదు. అన్నిరకాల పువ్వులలోంచీ పరిమళం వస్తోంది. మేము ఒకరిని చూచి ఒకరం చిరునవ్వు నవ్వుకున్నాం.

ఆ వీధిలోంచి వెడితే ఒక సందువస్తుంది. ఆ సందులోంచి వెడితే ఇల్లు.

గతానికి ఎలా బంధింపబడి ఉంటాం మనం! కాని, గతానికి మనం బంధింపబడిలేము.మనమే గతం. గతం ఎంత గందరగోళంగా ఉంటుంది, పొరమీద పొరగా, హరాయించుకోలేని జ్ఞాపకాలు - ఆప్యాయంగా అట్టిపెట్టుకున్నవీ, విచారకరమైనవీ - రెండు రకాలూ. అది రాత్రీ, పగలూ మన వెంటపడుతోంది. అప్పుడప్పుడు విరామం ఉంటుంది, స్పష్టమైన వెలుగు కనిపిస్తూ, గతం ఒక నీడలాంటిది. అన్నిటినీ మందకొడిగానూ, అలిసిపోయేటట్లూ చేస్తుంది. ఆ నీడలో ప్రస్తుతం స్పష్టతనీ, స్వచ్ఛతనీ పోగొట్టుకుంటుంది. రేపు అనేది గతం యొక్క నీడ. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు - మూడూ జ్ఞాపకం అనే పొడుగాటి తాడుతో కట్టి ఉంటాయి. ఆ మొత్తం కట్టిన మూటే జ్ఞాపకం.