పుట:Mana-Jeevithalu.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
209
జ్వాల, పొగ

మందకొడిది ఎప్పుడూ మందకొడిగానే ఉంటుంది. తెలిచి తక్కువతనం ఎన్నటికీ వివేకం కాలేదు. వివేకంగా అవాలని ప్రయత్నించటం తెలివితక్కువ తనం. మనకున్న ఇబ్బందుల్లో ఇదొకటి, కాదా? మనం ఎప్పుడూ ఏదో అవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మందకొడితనం అలాగే ఉండిపోతుంది.

"అయితే ఏం చెయ్యాలి?"

ఏమీ చెయ్యొద్దు. ఉన్నట్లుగానే ఉండండి - సున్నితత్వం లేకుండా ఏదైనా చెయ్యటం అంటే ఉన్నస్థితిని తప్పించుకోవటం. ఉన్నదాన్ని తప్పించుకోవటం ఉఠ్ఠి తెలివితక్కువతనం. అది ఏం చేసినా తెలివితక్కువ తనం ఇంకా తెలివి తక్కువ తనం లాగే ఉంటుంది. సున్నితత్వం లేనిది సున్నితమైనది కాలేదు. అది చేయగలిగినదల్లా ఉన్నస్థితిని తెలుసుకుంటూ ఉన్నస్థితిలో దాని కథని నడవనివ్వాలి. సున్నితత్వం లేకపోవటం అనే దాంట్లో కలుగజేసుకోవద్దు. అలా కలుగజేసుకునేది సున్నితత్వం లేనిది, తెలివి తక్కువది అయి ఉంటుంది. వినండి. దాని కథ అదే చెబుతుంది. దాన్ని అనువదించవద్దు, చర్య తీసుకోవద్దు. కాని అడ్డుపడకుండా, వ్యాఖ్యానం చెయ్యకుండా కథ చివరిదాకా వినండి. అప్పుడే చర్య జరుగుతుంది చెయ్యటం ముఖ్యం కాదు, వినటమే.

ఇవ్వటానికి తరిగిపోనిది ఉండాలి. వెనుదీస్తూ ఇవ్వటంలో అయిపోతుందన్న భయం ఉంటుంది. అయిపోవటంలోనే తరిగిపోనిది ఉంటుంది. ఇవ్వటం అంటే అయిపోవటంకాదు. ఎక్కువలోంచో, తక్కువలోంచో ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ అయినా, తక్కువ అయినా పరిమితమైనదే. అది పొగ - ఇవ్వటం, పుచ్చుకోవటం, కోరికలా, అసూయలా, కోపంలా, నిరాశలా పొగ. కాలమంటే భయం ఉండటం పొగ. జ్ఞాపకం, అనుభవం కూడా పొగే, ఇవ్వటం ఉండదు, పొగని విస్తరింప జేయటమే. వెనుదీయటం తప్పనిసరి, ఎందువల్లనంటే, ఇచ్చేదేమీ లేదు కనుక. పంచుకోవటం ఇవ్వటం కాదు. పంచుకుంటున్నాం, ఇస్తున్నాం అని తెలిసి చేయటం సంపర్కం అంతం అయేటట్లు చేస్తుంది. పొగ జ్వాలకాదు. కాని, అదే జ్వాల అని అపోహ పడతాం. అది పొగ అని తెలుసుకుని ఉండండి. జ్వాలని చూడాలనుకుని, దాన్ని ఊదెయ్యకండి.