పుట:Mana-Jeevithalu.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
208
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

శారీరకంగా వెనక్కి తియ్యక పోవచ్చు. మొదట్లో సర్వమూ అర్పించుకోవచ్చు. అప్పుడు కూడా వెనక తీయటం ఉంటుంది. ఇవ్వటం అనేది అనుభూతుల ప్రతిఫలం. కాని, నిజంగా ఇవ్వగలిగినది ఎక్కడో దూరంగా మేలుకోకుండా ఉంటుంది. మేము కలుసుకుంటాం. కానీ, పొగలో కూరుకుపోతాం. కాని, అది జ్వాల కాదు. మాలో ఆ జ్వాల ఎందుకుండదు? పొగ లేకుండా జ్వాల ఎందుకు మండటం లేదు? మేము మరీ తెలివి మీరి పోయామా అనిపిస్తోంది. మరీ తెలిసినందువల్లనేమో ఆ సౌరభం లభించటం లేదు. నేను మరీ ఎక్కువ చదువుకున్నందువల్ల మరీ అధునాతనంగా, పైపై తెలివితో, మూర్ఖంగా ఉన్నాననుకుంటాను. తెలివిగా మాట్లాడినా నిజంగా నాది మంద బుద్ధి అనుకుంటాను."

ఇది మందకొడితనానికి సంబంధించిన విషయమా? ప్రేమ అంత బ్రహ్మాండమైన ఆదర్శమా? అంత సాధించలేకపోయేదీ, దానికి అన్ని అవసరాలూ సమకూరితేనే సాధించగలిగేదీనా? అన్ని అవసరాలూ సమకూర్చటానికి తీరిక ఉంటుందా ఎవరికైనా? మనం అందం గురించి మాట్లాడతాం, దాన్ని గురించి రాస్తాం, దాన్ని చిత్రిస్తాం, నాట్యం చేస్తాం, బోధిస్తాం. కాని, మనం అందంగా ఉండం. అలాగే, మనకి ప్రేమ తెలియదు. మనకి తెలిసినవి మాటలు మాత్రమే.

బాహాటంగా, దెబ్బతగిలేటట్లు ఉండటమంటే సున్నితంగా ఉండటం. వెనుదీయటం అనేది ఉన్నప్పుడు సున్నితత్వం ఉండదు. సుకుమారంగా ఉండేవారు రక్షణ లేకుండా, రేపు - అనేదాన్నుంచి స్వేచ్ఛగా ఉంటారు. బాహాటంగా ఉన్నదే గర్భితమై ఉన్నది, తెలియనిది. బాహాటంగా సుకుమారంగా ఉండేది అందంగా ఉంటుంది. మూసిపెట్టి ఉన్నది మందకొడిగానూ, సున్నితత్వం లేకుండానూ ఉంటుంది. మందకొడితనం కూడా గడుసుతనంలాగే ఒక విధంగా ఆత్మరక్షణ కలిగించేదే. ఈ తలుపు తెరుస్తాం, కాని ఆ తలుపు మూసేసి ఉంచుతాం. స్వచ్ఛమైన గాలి ఒక ప్రత్యేకమైన ద్వారం గుండానే రావాలనుకుంటాం. మనం బయటికి వెళ్లం. అన్ని తలుపులూ, కిటికీలూ ఒక్కసారిగా తెరవనూ తెరవం. సున్నితత్వం కాలక్రమేణా పొందేది కాదు. మందకొడిది ఎన్నటికీ సున్నితంగా అవలేదు.