పుట:Mana-Jeevithalu.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


64. జ్వాల, పొగ

రోజంతా వేడిగా ఉంది. బయటికి వెళ్లాలంటే బ్రహ్మ ప్రయత్నంగా ఉంది. అసలే, రోడ్డుమీదా, నీటిమీదా పడి కొట్టొచ్చేటట్లూ, గుచ్చు కుంటున్నట్లూ ఉన్నకాంతి తెల్లటి ఇళ్లమీదపడి మరింత తీవ్రంగా ఉంది. అంతకుముందు పచ్చగా ఉండే నేల ఇప్పుడు ఎండిపోయి, బంగారంలా మెరుస్తోంది. వానలు రావటానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. అ చిన్న కాలవ ఎండిపోయి మెలికలు తిరిగిన ఇసుక సీలికలా ఉంది. కొన్ని పశువులు చెట్లనీడని ఉన్నాయి. వాటికి దూరంగా కూర్చుని ఓ కుర్రాడు వాటిని కాపలా కాస్తున్నాడు. గ్రామం కొన్నిమైళ్ల దూరంలో ఉంది. అతడు ఒక్కడూ ఉన్నాడు. బక్క పలచగా తిండి సరిగ్గా లేనట్లుగా ఉన్నాడు. కాని ఆనందంగా ఉన్నాడు. అతను పాడేపాట మరీ విషాదంగా లేదు.

కొండదాటితే ఇల్లు వస్తుంది. సూర్యాస్తమయం అయే సమయానికి ఇంటికి చేరుకున్నాం. డాబా మీంచి చూస్తే, కొబ్బరి చెట్ల పైభాగం ఆకు పచ్చగా ఉండి, క్రింద పసుపుపచ్చని ఇసుక దాకా వంగుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలు పసుపుపచ్చగా పడుతున్నాయి. వాటి ఆకులు బంగారం రంగులో ఉన్నాయి. ఆ పసుపు పచ్చని ఇసుక దిబ్బలకవతలగా ఆకుపచ్చ బూడిదరంగులో సముద్రం. తెల్లటికెరటాలు ఒడ్డుమీదికి పోగవుతున్నాయి. కాని, లోతుగా ఉన్న నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. సూర్యుడు దూరాన అస్తమిస్తున్నా, సముద్రంపైన మేఘాలు రంగుపులుముకుంటున్నాయి. సాయంకాలపు నక్షత్రం అప్పుడే కనిపిస్తోంది. చల్లని గాలి వీచింది కాని, డాబా ఇంకా వేడిగా ఉంది. ఒక చిన్న గుంపు చేరిందక్కడ. వాళ్లక్కడ చాలా సేపటి నుంచీ ఉండి ఉంటారు.

"నాకు వివాహం అయింది. పిల్లల తల్లిని. కాని, నాకు ఎప్పుడూ ప్రేమ కలగలేదు. అసలు ప్రేమ అనేది ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాను. మనకు అనుభూతులూ, ఆవేశాలూ, ఉద్రేకాలూ, సంతృప్తినిచ్చే సుఖాలూ తెలుసును. ప్రేమ అనేది తెలుసునా అనిపిస్తుంది నాకు. మేము ప్రేమిస్తున్నాం అంటూంటాం తరుచు. కాని, ఏదో వెనక్కి తీసేట్లు చేస్తుంది.