పుట:Mana-Jeevithalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఏర్పరచుకుంటుంది. తరవాత వీటిని వదులుకుంటుంది, అంతకన్న ఉన్నత స్థాయిలో ఉండటానికి - ఉన్నతస్థాయి ఎక్కువ సంతృప్తి నిచ్చేదీ, ఎక్కువ శాశ్వతమైనదీ కనుక. సందిగ్ధతవల్ల కలిగే భయం, ఏమీ కానేమోననే భయం, మమకారబంధం పెంచుకునేట్లూ, సొంతం చేసుకునేట్లూ చేస్తుంది. సొంతం చేసుకున్నది అసంతృప్రికరంగా గాని, బాధాకరంగాగాని ఉంటే దాన్ని పరిత్యజిస్తాం - మరింత సంతోషకరమైన బంధంకోసం. అన్నిటికన్నా సంతృప్తికరమైనదీ, ఆఖరున సొంతం చేసుకోవాలనుకునేదీ దైవం అనే పదం, లేదా, దాని స్థానంలో మరోటి - ప్రభుత్వం అనేది.

"కాని, ఏమీ కాకుండా ఉండటం గురించి భయపడటం సహజం. ఏమీ కాకుండా ఉండటానికే ఇష్టపడాలని మీ ఉద్దేశం అనుకుంటాను."

ఏదో అవాలని మీరు ప్రయత్నిస్తున్నంతవరకూ ఏదో మిమ్మల్ని ఆక్రమించినంతవరకూ, సంఘర్షణ, గందరగోళం, దుఃఖం అధికం కావటం తప్పదు. మీ మటుకు మీరు మీ సాధించిన గొప్పతనం, విజయం మూలాన్ని ఈ అధిగమిస్తున్న విధ్వంసంలో చిక్కుకోరనే అనుకుంటూండవచ్చు. కాని, మీరు దాన్ని తప్పించుకోలేరు - మీరూ అందులోని వారే కాబట్టి. మీ కార్యకలాపాలూ, మీ ఆలోచనలూ, మీ జీవన నిర్మాణం కూడా సంఘర్షణ పైనా, గందరగోళం పైనా ఆధారపడి ఉన్నాయి. ఏమీ కాకుండా ఉండటానికి ఇష్టం లేనంత కాలం మీరు దుఃఖాన్నీ, వైరుధ్యాన్నీ పెంపొందించుకోవటం తప్పదు. ఏమీ కాకుండా ఉండాలని సంసిద్ధం కావటం పరిత్యజించటమూ కాదు, అంతరంగికంగా గాని, బాహ్యంగా గాని బలవంతం చెయ్యటమూ కాదు. అది ఉన్న స్థితిలోని యథార్థాన్నీ గ్రహించటమే. ఉన్నదానిలోని యథార్థాన్ని గ్రహించటంతో, రక్షణలేకపోవటం వల్ల ఏర్పడిన భయం నుంచి విముక్తి కలుగుతుంది. బంధాన్నీ పెంపొందించి, బంధం తెంచుకోవటం, పరిత్యజించటం - అనే భ్రమకి దారితీసి భయం నుంచి విముక్తి కలుగుతుంది ఉన్నస్థితిని ప్రేమించటమే వివేకానికి ఆరంభం. ప్రేమ ఒక్కటే పంచుకుంటుంది. అదొక్కటే సంపర్కం కలిగించుకోగలదు. కాని, పరిత్యజించటం, పరిత్యాగం చేయటం ఒంటరితనానికీ, భ్రమకీ మార్గాలూ.