పుట:Mana-Jeevithalu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అడుగున మరో భావం కూడా ఉన్నట్లు - "ఆయన ఉండవలసినంత గొప్పవాడుగా ఉండకపోవచ్చు, అయినా ఆయన చేసిన త్యాగాలు చూడండి, అవి మాత్రం తక్కువా" అంటున్నట్లుగా తోచింది. ఆ గొప్పమనిషి కూడా దేశాభివృద్ధి గురించీ, నీటి పారుదల అభివృద్ధి గురించీ, ప్రజలకు భోగభాగ్యాలు కలుగజేయటం గురించీ, కమ్యూనిజం వల్ల రాబోయే ప్రమాదం గురించీ, బృహత్ప్రణాళికల గురించీ మాట్లాడాడు. మనిషిని మరిచిపోవటం అయింది. ప్రణాళికలూ, సిద్ధాంతాలు మిగిలాయి.

ఒక లక్ష్యాన్ని, సాధించటం కోసం పరిత్యాగం చేస్తే అది వస్తువుల మార్పిడి వ్యాపారమే. అందులో త్యాగం చేసేదేమీ ఉండదు. ఒకదానికొకటి మార్చితీసుకోవటమే. ఆత్మత్యాగం ఆత్మని విస్తృతం చేసుకోవటమే. ఆత్మని త్యాగం చేసుకోవటం అంటే ఆత్మకి మెరుగు పెట్టటమే. ఆత్మ తన్నుతాను ఎంత సూక్ష్మంగా చేసుకున్నప్పటికీ, అది ఇంకా మూసుకుపోయి, అల్పంగా పరిమితంగా ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం త్యాగం చేస్తే, అది ఎంత గొప్పదైనా, ఎంత అపారమైనదనా, ప్రధానమైనదైనా అ ప్రయోజనాన్ని ఆత్మకి ప్రత్యామ్నాయంగా చేయటమే అవుతుంది. ఆ ప్రయోజనమో, ఊహో "ఆత్మ", "నేను", "నా" అనేది అవుతుంది. తెలిసి త్యాగం చేయటం ఆత్మవిస్తరణమే. మళ్లీ సంపాదించుకోవటం కోసం వదిలివేయటమే. తెలిసి త్యాగం చేయటం ఆత్మని అవ్యక్తంగా బలపరచటమే. వదిలివేయటం మరోరకమైన సంపాదన. దాన్ని పొందటం కోసం దీన్ని వదులుకుంటారు. దీన్ని నీచస్థాయిలో ఉంచి, దాన్ని ఉన్నంత స్థాయిలో ఉంచుతారు. ఉన్నత స్థాయిని పొందటానికి నీచస్థాయిని "వదులుకుంటారు". ఈ ప్రక్రియలో వదులుకోవటం అనేది ఉండదు. మరింత ఎక్కువ సంతృప్తిని పొందటానికి ప్రయత్నించటంలో త్యాగం అనేది ఉండదు. అందరూ మనసుపడి చేసే సంతృప్తికరమైన కార్యకలాపానికి అంత ధర్మప్రవర్తన ధ్వనించే పదాన్ని వాడటం ఎందుకు? మీ సాంఘిక పదవిని మీరు "వదులుకోవటం" మరోరకమైన పదవిని పొందటానికే. బహుశా, మీకది ఇప్పుడు ఉండే ఉండవచ్చు. అందుచేత మీ త్యాగం మీరు కోరిన ప్రతిఫలాన్నే ఇచ్చింది. కొంతమంది తమ ప్రతిఫలాన్ని స్వర్గంలో కోరుకుంటారు. తక్కినవాళ్లు ఇక్కడే ఇప్పుడే కావాలనుకుంటారు.