పుట:Mana-Jeevithalu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ త్యాగం

203

ఆలోచన ఎప్పుడూ పాత దాన్నుంచే. ఈ నిజాన్ని గ్రహించండి. నిజం ఎప్పుడూ స్వేచ్ఛను కలుగజేస్తుంది - ఆలోచన నుంచీ, ఫలితాన్నుంచీ స్వేచ్ఛను కలుగజేస్తుంది. అప్పుడు చైతన్యావస్థకి అతీతమైనది - అది నిద్రపోవటం కాదు, మెలుకువగా ఉండటం కాదు, దానికి పేరు లేదు. అది ఉంటుంది.


63. ఆత్మ త్యాగం

ఆయన బాగా లావుగా ఉన్నాడు, తన్ను చూసుకుని మురిసి పోతున్నాడు. ఆయన జైలుకి చాలాసార్లు వెళ్లాడుట. పోలీసులచేత దెబ్బలు తిన్నాడుట. ఇప్పుడు బాగా పేరు పొందిన రాజకీయవేత్త; మంత్రి కాబోయే స్థితిలో ఉన్నాడు. ఆయన ఎన్నో సమావేశాలకు వచ్చాడు. ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా అందరితో బాటు కూర్చున్నాడు. కాని, అందరికీ ఆయనెవరో తెలుసును. ఆయన మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్నట్లు అధికారయుతమైన కంఠంతో మాట్లాడాడు. చాలామంది ఆయన వైపు చూశారు. ఆయన గొంతు వాళ్లస్థాయికి దిగిపోయింది. ఆయన వాళ్లతో బాటు కూర్చున్నా, తన్నుతాను ప్రత్యేకించుకున్నాడు. తనుపెద్ద రాజకీయవేత్త. తనగురించి అందరికీ తెలుసును. అంతా గౌరవిస్తారు. కాని, ఆ గౌరవం కొంతవరకే వెళ్లింది. ఆ పైన ఇకలేదు. చర్చ మొదలైన తరవాత ఇదంతా తెలిసింది. శ్రోతల మధ్య బాగా పేరుమోసిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఉండే ఒక విచిత్ర వాతావరణం ఉంది. ఆశ్చర్యం, నిరీక్షణ, సాహచర్యం, అనుమానం, ప్రసన్నతతో వేరుగా ఉండటం, సంతోషం - ఇవన్నీ కూడిన వాతావరణం అది.

ఆయన ఒక స్నేహితుడితో కలిసి వచ్చాడు. ఆ స్నేహితుడు వివరించటం మొదలుపెట్టాడు - ఆయనెవరో, ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్లాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, దేశస్వాతంత్ర్యం కోసం ఎన్ని అపారమైన త్యాగాలు చేశాడో. ఆయనకి బాగా డబ్బుండేది. పాశ్చాత్య పద్ధతిలో పెరిగాడు - పెద్ద ఇల్లు, తోటలు, బోలెడు కార్లు మొదలైన వాటితో. ఆ స్నేహితుడు ఆ గొప్ప మనిషి ఘనకార్యాల గురించి చెబుతూంటే అతడి గొంతు అంతకంతకు మరింత ప్రశంసాపూర్వకంగా, గౌరవపూర్వకంగా అయింది. కాని, దాని