పుట:Mana-Jeevithalu.pdf/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
201
ఆలోచన, చైతన్యం

ఖండిస్తుంది, లేదా సమర్థిస్తుంది. అందువల్ల అది ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. ఇటూ అటూ తిప్పుతుంది, నేర్పుతో ఉపయోగిస్తుంది, ఇటూ అటూ తిరుగుతుంది, కొంత దూరం పోతుంది. కాని దాని గొలుసుల్లోంచి అదే బయటపడలేదు. ఆలోచన జ్ఞాపకానికి లంగరువేసి ఉంటుంది. ఏ సమస్యలోని నిజాన్నీ కనుక్కోగలిగిన స్వేచ్ఛ దానికుండదు.

"మీ ఉద్దేశంలో ఆలోచనకి ఏవిధమైన విలువా లేదనా?"

పరిణామాలను సర్దుబాటు చేయటంలో దానికి విలువ ఉంది. కాని, చర్య తీసుకునేందుకు సాధనంగా మాత్రం దానంతట దానికి విలువలేదు. చర్య అంటే పరివర్తన, అంతేకాని, పరిణామాలను సర్దుబాటు చేయటం కాదు..ఆలోచనలతో, ఊహతో, నమ్మకంతో సంబంధం లేని చర్య ఒక మూసలో పోసినట్లుగా ఎన్నటికీ ఉండదు. ఒక పథకం ప్రకారం కార్యకలాపం ఉండొచ్చు. ఆ కార్యకలాపం హింసాత్మకం, రక్తమయం అయినా కావచ్చు, లేదా దానికి వ్యతిరేకం కావచ్చు. కాని, అది చర్య మాత్రం కాదు. వ్యతిరేకమైనది చర్యకాదు, కార్యక్రమాన్ని కొద్ది మార్పులు చేసి కొనసాగించటం. వ్యతిరేకమైనది కూడా ఫలితంలోని భాగమే. వ్యతిరేకమైన దాన్ని ప్రయత్నిస్తూ ఆలోచన తన ప్రతిక్రియల వలలో తానే చిక్కుకుంటుంది. చర్య ఆలోచన ఫలితం కాదు. చర్యకీ ఆలోచనకీ సంబంధం లేదు. ఆలోచన ఫలితం కాబట్టి కొత్తదాన్ని ఎన్నటికీ సృష్టించలేదు. కొత్తది క్షణక్షణానికీ పుడుతుంది. ఆలోచన ఎప్పుడూ పాతది, గతించినది, ప్రభావితమైనది. దానికి విలువ ఉంది, కాని స్వేచ్ఛ లేదు. విలువంతా పరిమితమే. అది బంధిస్తుంది. ఆలోచన బందనంలో ఉంచుతుంది, అది విలువైనది కాబట్టి.

"చైతన్యంగా ఉండటానికీ ఆలోచనకీ సంబంధం ఏమిటి?"

అవి రెండూ ఒకటే కాదా? ఆలోచించటానికీ, చైతన్యంగా ఉండటానికీ ఏదన్న తేడా ఉందా? ఆలోచించటం ఒక ప్రతిక్రియ. చైతన్యంగా ఉండటం కూడా ప్రతిక్రియేకాదా? ఆ కుర్చీ గురించి తెలిసి ఉండటం ఏదో ప్రేరేపిస్తే కలిగిన ప్రతిక్రియ. దేన్నైనా ఎదుర్కొన్నప్పుడు జ్ఞాపకం వల్ల కలిగిన ప్రతిక్రియ కాదా ఆలోచన? ఈ ప్రతిక్రియనే అనుభవం అంటున్నాం. అనుభవం.