పుట:Mana-Jeevithalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

రెక్కలు ముడుచుకుంటున్నాయి. నది తన మెరుపు పోగొట్టుకుంది. నీళ్లు ఇంక నాట్యం చెయ్యటం లేదు. ప్రశాంతంగా ఆగిపోయి ఉన్నాయి. పర్వతాలు దూరంగా, సమీపించటానికి వీల్లేకుండా ఉన్నాయి. మనిషి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రయింది. ఏకాంతంలో నిశ్చలత ఉంది. ఏవిధమైన సంపర్కం లేదు. దేనికది మూసేసుకుంది. తన్ను తాను వేరు చేసుకుంది. పువ్వు, ధ్వని, సంభాషణ - ఏదీ పైకి తెలియకుండా అభేద్యంగా ఉంది. నవ్వు ఉంది - కాని అదొక్కటే ఎక్కడో దూరంగా ఉంది. సంభాషణ అణచిపెట్టినట్లుగా లోపలగా ఉంది. ఒక్క నక్షత్రాలే ఆహ్వానిస్తున్నాయి - బాహాటంగా తెలియజేస్తూ. కాని అవి కూడా ఎంతో దూరంగా ఉన్నాయి.

ఆలోచన ఎప్పుడూ బాహ్యప్రతిక్రియే. దాని ప్రతిక్రియ ప్రగాఢంగా ఎప్పుడూ ఉండదు. ఆలోచన ఎప్పుడూ పైపైన ఉండేదే. ఆలోచన ఎప్పుడూ ఒక పరిణామమే. పరిణామాలను సర్దుబాటు చేయటమే ఆలోచించటం. ఆలోచన ఎప్పుడూ పైపైదే - వివిధ స్థాయిల్లో తన్ను తాను ఉంచుకున్నప్పటికీ. ఆలోచన ప్రగాఢమైన దానిలోకి, అంతర్గర్భితమైన దానిలోకి చొచ్చుకుని పోలేదెన్నటికీ. ఆలోచన తన్ను తాను దాటిపోలేదు. అందుకోసం ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి నిస్పృహ కలుగుతుంది.

"మీ ఉద్దేశంలో ఆలోచన అంటే ఏమిటి?"

ఆలోచన ఎటువంటి సమస్య ఎదురైనా దానికి ఏర్పడే ప్రతిక్రియ. ఆలోచన చర్యకాదు, చెయ్యటంకాదు. ఆలోచన ఒక పరిణామం, ఫలితం యొక్క ఫలితం. అది జ్ఞాపకం యొక్క ఫలితం. జ్ఞాపకమే ఆలోచన. జ్ఞాపకాన్ని మాటల్లో వ్యక్తం చేయటమే ఆలోచన. జ్ఞాపకం అంటే అనుభవం. ఆలోచించటమనే ప్రక్రియ చైతన్యప్రక్రియ - అవ్యక్తమైనదీ, వ్యక్తమైనదీ కలిపి. ఈ ఆలోచనా ప్రక్రియ అంతా చైతన్యంగా ఉండటమే; మెలుకువగా ఉండటం, నిద్రపోవటం, పై స్థాయి, లోలోపలి స్థాయి అన్నీ జ్ఞాపకం యొక్క, అనుభవం యొక్క భాగాలే. ఆలోచన స్వతంత్రమైనది కాదు. స్వతంత్రంగా ఆలోచించటం అంటూ ఉండదు. "స్వతంత్రంగా ఆలోచించటం" అనే మాటలు పరస్పర విరుద్ధమైనవి. ఆలోచన ఒక ఫలితం కాబట్టి అది వ్యతిరేకిస్తుంది, లేదా ఒప్పుకుంటుంది, పోలుస్తుంది, లేదా సర్దుకుంటుంది,