పుట:Mana-Jeevithalu.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


61. ఆనందాన్ని కోరటం

ఆ విశాలమైన పచ్చని మైదానంలో ఉన్న ఆ ఒక్క చెట్టూ అ చిన్న ప్రపంచానికీ, అందులో ఉండే అడవులూ, ఇల్లూ, చిన్న సరస్సూ - వీటన్నిటికీ కేంద్రం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశమంతా ఎత్తుగా విశాలంగా ఉన్న ఆ చెట్టువైపుకి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. అది చాలా పురాతనమైనదై ఉంటుంది. కాని, దానిలో ఏదో స్వచ్ఛత ఉంది, అప్పుడే పుట్టిందా అన్నట్లు. దానికి ఎండుకొమ్మలు ఎప్పుడూ ఉండవు. దాని ఆకులు ఎక్కడా మచ్చ లేకుండా పొద్దుట ఎండలో మెరుస్తూ ఉంటాయి. అది ఒంటరిగా ఉండబట్టి అన్నీ దానివైపుకి వస్తున్నట్లుగా కనబడుతుంది. లేళ్లూ, పులులూ, కుందేళ్లూ, ఆవులూ, మేకలూ మొదలైన మృగాలూ దాని నీడ క్రింద గుమిగూడుతాయి. ముఖ్యంగా మధ్యాహ్న వేళ. అందంగా తీర్చిదిద్దినట్లున్న ఆ చెట్టు ఆకాశానికి రూపుదిద్దింది. ఆ ఉదయపు కాంతిలో ఆ చెట్టు ఒక్కటే సజీవమైన దానిలా కనిపించింది. అడవుల్లోంచి చెట్టు చాలా దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాని, ఆ చెట్టు దగ్గర్నుంచి అడవులూ, ఇల్లూ, ఆకాశమూ కూడా ఎంతో దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది. కదిలిపోయే మేఘాలను స్పృశించవచ్చుననిపిస్తుంది చూచినప్పుడల్లా.

ఆ చెట్టుక్రింద అప్పటికే చాలా సేపటినుంచి కూర్చున్నాం. ఆయన కూడా వచ్చి మాతో చేరాడు. ఆయనకి ధ్యానం చెయ్యటంలో తీవ్రమైన ఆసక్తి ఉంది అన్నాడు. చాలా ఏళ్లు సాధన చేశాడుట. ఓ ప్రత్యేకమైన సిద్ధాంతానికి చెందిన వాడు కాడుట. ఎందరో క్రిస్టియన్ తాత్త్వికుల గురించి చదివాడుట గాని, హిందూ, బౌద్ధమహాత్ములు బోధించిన ధ్యానం, క్రమశిక్షణా తన్ను ఎక్కువగా ఆకర్షించాయన్నాడు. సన్యసించటంలోనూ, పరిత్యాగశక్తిని అలవరచుకోవటంలోనూ ఉన్న విచిత్రమైన ఆకర్షణ ఎంత అపరిపక్వమైనదీ చిన్నప్పుడే గ్రహించాడుట. ఆయన మొదటినుంచీ మితిమీరిన వాటన్నిటికీ దూరంగా ఉన్నాడుట. అయితే, ఆయన క్రమశిక్షణా, హెచ్చుతగ్గులు లేని ఆత్మనిగ్రహం పాటించాడుట. ధ్యానాన్నీ, దానికి అతీతమైన దాన్నీ తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్నాడుట. దీక్షగా నీతివంతమైన జీవితాన్ని