పుట:Mana-Jeevithalu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కావాలి. మనం ఒకదాని తరవాత మరొక దానివెంట పడతాం - స్త్రీ ఒక్కొక్క కొట్టూ చూసుకుంటూ పోయినట్లు. మనకి పూర్తిగా తృప్తి కలిగించేదేదో దొరికేవరకూ ప్రయత్నిస్తాం. ఆ తరవాత స్థిరపడిపోతారు, ఎదుగూ, బొదుగూ లేకుండా. మనం నిత్యం దేనికో ఒకదానికోసం తాపత్రయపడుతూనే ఉంటాం. చాలావరకు అసంతృప్తికరమైనవాటినెన్నిటినో రుచి చూసి ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఆఖరికి అసలైనది కావాలి. దేవుడు, సత్యం, ఏదైనా అనుకోండి. మనకి ఫలితం కావాలి, నూతన అనుభవం, నూతన అనుభూతి, దేనికైనా తట్టుకోగలిగేదీ కావాలి. ఫలితం అనేదాని నిష్ప్రయోజకత్వాన్ని ఎప్పుడూ గ్రహించం - ఏదో ఒక ప్రత్యేక ఫలితాన్నే తప్ప. అందుకనే ఒక ఫలితం నుంచి మరో ఫలితానికి తిరుగాడుతూ ఉంటాం - అన్ని అన్వేషణలనూ అంతం చేయగలది దొరుకుతుందనే ఎప్పుడూ ఆశిస్తూ.

ఫలితం కోసం, విజయం కోసం చేసే ప్రయత్నం బంధించేదిగా, పరిమితం చేసేదిగా ఉంటుంది. ఎప్పుడూ ఆఖరవుతూనే ఉంటుంది. సాధించటంలోనే అంతమవటం ఉంటుంది. చేరుకోవటమే మరణించటం. అయినా, మనం కోరుతున్నది అదే, కాదా? మనం మరణాన్ని కోరుతున్నాం. దాన్ని అనటం మాత్రం ఫలితం అనీ, గమ్యం అనీ, లక్ష్యం అనీ అంటున్నాం. మనం గమ్యం చేరుకోవాలనుకుంటాం. ఈ అనంతమైన పోరాటంతో అలిసిపోయాం. అక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నాం - "అక్కడికి" అనేది ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. వృథా అయిన ఈ పోరాటం యొక్క వినాశకత్వాన్ని గ్రహించకుండా ఒక ఫలితం సాధించటం ద్వారా దాన్నుంచి విముక్తి పొందాలని వాంఛిస్తాం. ఈ పోరాటంలోని, ఈ సంఘర్షణ లోని సత్యాన్ని గ్రహించం. అందువల్ల దాన్నొక సాధనంగా ఉపయోగించాలనుకుంటాం - అత్యంత సంతృప్తికరమైనది సాధించటం కోసం. ఏది అత్యంత సంతృప్తి నిస్తుందో అది మనకున్న అసంతృప్తి యొక్క ప్రగాఢతను బట్టి నిర్ణయమవుతుంది. ఫలితం ఆశించే కోరిక ఎప్పుడూ నెరవేరుతుంది. కాని, మనకి ఎప్పటికీ అంతంగాని ఫలితం కావాలి. అంచేత మన సమస్య ఏమిటి? ఫలితాలకోసం తాపత్రయ పడకుండా స్వేచ్ఛగా ఎలా ఉండాలన్నది కాదా?