పుట:Mana-Jeevithalu.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
193
ఫలితం యొక్క నిరర్థకత

అవుతుంది. కాని, ఆ నిశ్శబ్దాన్ని కోరటం మరొక సమస్యనీ, మరొక సంఘర్షణనీ పెంపొందిస్తుంది. విశదీకరించటాలూ, కారణాలు విప్పిచూపటాలూ, సమస్యలు విడదీసి పరీక్షించటాలూ దాన్ని ఏవిధంగానూ పరిష్కరించలేవు. ఎందువల్లనంటే, దాన్ని మానసిక పద్ధతుల్లో పరిష్కరించటానికి సాధ్యమవదు. మనస్సు మరికొన్ని సమస్యల్ని పెంచుతుందంతే. అది సమస్య నుంచి విడిపించుకోలేదు. మనస్సే సమస్యలూ, సంఘర్షణలూ పెరిగి పెంపొందే స్థలం. ఆలోచన తన్నుతాను నిశ్శబ్దంగా ఉంచుకోలేదు. నిశ్శబ్దపు ముసుగును వేసుకోగలదు. అది కేవలం దాపరికం, వేషం మాత్రమే. ఒక నిశ్చిత లక్ష్యం కోసం క్రమశిక్షణతో కూడిన చర్య తీసుకోవటం ద్వారా ఆలోచన తన్ను తాను చంపుకోగలదు. కాని, చావు నిశ్శబ్దం కాదు. బ్రతుకు కన్న చావు మరింత అరిచి పెడబొబ్బలు పెడుతుంది. మనస్సులోని ఏవిధమైన సంచలనమైనా నిశ్శబ్దానికి భంగకరం.

తెరిచి ఉన్న కిటికీల్లోంచి ధ్వనులు గందరగోళంగా వినిపిస్తున్నాయి - ఊరిలో గట్టిగా మాట్లాడుకోవటం, తగువులాడుకోవటం, ఇంజనుకూత పెట్టటం, పిల్లల ఏడుపులూ, కేరింతలూ, వెళ్లేలారీ రొదా, తేనెటీగలు ఝమ్మనటం, కాకులగోలా, ఈ రణగణ ధ్వని మధ్యలో నిశ్శబ్దం గదిలోకి మెల్లిగా పరుచుకుంటోంది కోరకుండానే, పిలవకుండానే. మాటలమధ్య నుంచీ నిశ్శబ్దం రెక్కలు విప్పుకుంటోంది. ఆ నిశ్శబ్దం లక్షణం - చప్పుళ్లూ, కబుర్లూ, మాటలూ ఆగిపోవటం కాదు; నిశ్శబ్దాన్ని ఇముడ్చుకోవటానికి మనస్సు విస్తరించే శక్తిని పోగొట్టుకోవాలి. ఏ బలవంతాలూ, సర్దుకు పోవటాలూ, ప్రయత్నాలూ లేకుండా స్వేచ్ఛగా ఉండే నిశ్శబ్దం అది. అది అనంతమైనది. నిత్య నూతనమైనది. నిత్యనిర్మలమైనది. కాని, ఆ నిశ్శబ్దం మాటకాదు.

మనం ఫలితాలనూ, లక్ష్యాలనూ, ఎందుకు ఆశిస్తాం? మనస్సు ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యాన్ని సాధించటానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? లక్ష్యాన్ని సాధించటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఇక్కడికి రావడంలో మనం దేన్నో ఏ అనుభవాన్నో, ఏ ఆనందాన్నో కోరటం లేదా? మనం ఆడుకున్న ఎన్నో వాటిపైన విసుగుపుట్టింది. ఇప్పుడు మనకి ఇంకొక కొత్త ఆటవస్తువు