పుట:Mana-Jeevithalu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఎలా ప్రేమించను?

191

వాళ్లు నాతోలేరు. నేను కేవలం ఒంటరిగా ఉన్నాను. నేను ప్రేమించటం ఎలా నేర్చుకోను? చెయ్యాలని ఏదో చేస్తే వస్తుందనుకునేటంత మూర్ఖుణ్ణి కాను. ఏదో త్యాగం చేస్తేనో, ఏదో వదులుకుంటేనో వస్తుందనుకోవటం లేదు. నేనెప్పుడూ ప్రేమ చూపించలేదని నేనెరుగుదును. అలా చేసి ఉంటే ఇప్పుడు నేనీ స్థితిలో ఉండకపోదునని కూడా తెలుసును. నేనేం చెయ్యాలి? నా ఆస్తిపాస్తులన్నిటినీ, సంపదనీ వదిలేసుకోనా?"

మీరు ఎంతో జాగ్రత్తగా పెంచిన తోటలో విషపు మొక్కలు మాత్రమే పెరిగాయని మీరు తెలుసుకున్నట్లయితే వాటిని వేళ్లతో సహా పెకిలించి పారెయ్యాలి. వాటి చుట్టూ కట్టిన గోడలన్నిటినీ పడగొట్టాలి మీరు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. మీకు పెద్దపెద్ద తోటలున్నాయి. ఎంతో తెలివిగా వాటిచుట్టూ గోడలు కట్టి సురక్షితంగా ఉంచారు. దానికి ప్రతిగా మరొకటి కోరకుండా ఉన్నప్పుడే ఆ పనిచేస్తారు. కాని చేసి తీరాలి. ధనవంతుడిగా చనిపోవటం వృథాగా జీవించినట్లే కాని, ఇదికాక, మనస్సునీ, హృదయాన్నీ ప్రక్షాళితం చేసి అన్నిటినీ కొత్తవిగా చేయగల జ్వాల ఉండాలి. ఆ జ్వాల మనస్సులోంచి వచ్చేది కాదు. అలవరచుకునేది కాదు. జాలిగుణం ప్రదర్శించి, దాన్ని మెరిసేటట్లు చేయవచ్చు. కాని, అది జ్వాల కాదు. సేవ అనే కార్యకలాపం లాభదాయకమూ, అవసరమూ అయినా అది ప్రేమకాదు. ఎంతో సాధన చేసి క్రమశిక్షణతో చూపే సహనం, చర్చిలో, దేవాలయంలో అలవరచుకున్న దయ, సరళ భాషణ, మృదు ప్రవర్తన, రక్షకుణ్ణీ, మూర్తినీ, ఆదర్శాన్నీ ఆరాధించటం - వీటిలో ఏదీ ప్రేమ కాదు.

"నేను విన్నాను. గమనించాను. వీటిలో దేనిలోనూ ప్రేమలేదని తెలుసుకున్నాను. కాని నా హృదయం శూన్యంగా ఉంది. దాన్ని నింపటం ఎలా? నేనేం చెయ్యాలి?"

బంధనం ప్రేమని నిలవనివ్వదు. బాధపడటంలో ప్రేమ దొరకదు. అసూయ శక్తిమంతమైనదైనా అది ప్రేమని బంధించి ఉంచలేదు. అనుభూతీ, దానివల్ల కలిగే తృప్తీ ఎప్పుడూ అంతమైపోతూనే ఉంటాయి. కాని, ప్రేమ అనంతమైనది.