పుట:Mana-Jeevithalu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

బాటు దూరాన్నుంచి మనుషుల చప్పుడూ, మువ్వల ధ్వనీ అప్పుడప్పుడు గంట చప్పుడూ వినవస్తోంది. లోయలోంచి పొగ తిన్నగా పైకి పోతోంది. దాన్ని చెల్లాచెదరు చేయటానికి తగినంత బలంలేదు గాలిలో. పొగపాయ చూడటానికి చాలా అందంగా ఉంది. లోయక్రింద నుంచి పైకి లేచి ఆకాశాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది - ఆ పురాతన దేవదారు వృక్షం లాగ. ఒక పెద్ద నల్లని ఉడత మమ్మల్ని చూచి తిట్టి తిట్టి చివరికి మానేసి, చెట్టుమీంచి క్రిందికి వచ్చింది ఇంకా కనుక్కుందామని. తరవాత కొంత తృప్తిపడి చకచకా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చిన్న మబ్బు ఏర్పడుతోంది. అది మినహా ఆకాశం నిర్మలంగా, మృదువుగా లేత నీలం రంగులో ఉంది.

ఆయన కళ్లకిదేమీ కనిపించటంలేదు. ఆయన తన ముఖ్య సమస్య గురించి సతమతమవుతున్నాడు - అంతకు ముందు ఇతర సమస్యలతో సతమతమయినట్లుగానే. సమస్యలు ఏర్పడుతూ ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. ఆయన బాగా ధనవంతుడు. సన్నగా కడ్డీలా ఉన్నాడు. కాని కులాసాగా ఉండి చిరునవ్వులు చిందిస్తాడు. ఇప్పుడాయన లోయకేసి చూస్తున్నాడు. కాని, చైతన్యవంతం చేసే అ అందం ఆయన్ని స్పృశించలేదు. ఆయన ముఖం మెత్తపడలేదు. అ గీతలు ఇంకా అలాగే కఠినంగా నిర్ణీతంగా ఉన్నాయి. ఆయన ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు - డబ్బుకోసం కాదు, దేవుడు అని ఆయన అనుకునేదానికోసం. ఆయన ఎప్పుడూ ప్రేమ గురించీ, దేవుడి గురించే మాట్లాడతాడు. ఆయన ఎంతో దూరాలు వెళ్లి అన్వేషించాడుట. ఎంతో మంది గురువుల వద్ద ఉన్నాడుట. వయస్సు పైబడుతున్న కొద్దీ ఆయన అన్వేషణ మరింత తీవ్రంగా అవుతోందిట. ఆయన ఎన్నోసార్లు వచ్చాడు ఈ విషయాలు మాట్లాడటానికి. కాని, గడుసుగా ముందువెనకలు ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవాడు. దేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవటానికి ఎంత ఖర్చవుతుంది. ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది - అని నిత్యం లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. ఆయనకున్నదంతా తనతోపాటు తీసుకువెళ్లలేడని తెలుసును. ఇంకేదైనా తీసుకువెళ్లవచ్చునేమో, తను వెళ్లేచోట పనికొచ్చే నాణెం లాంటి దేదైనా? ఆయన కఠినాత్ముడు. హృదయంతోగాని, చేత్తోగాని ఎప్పుడూ ఔదార్యం చూపించడు. ఇంకా కొంచెం ఇవ్వాలంటే ఎంతో సందేహిస్తాడు.