పుట:Mana-Jeevithalu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

స్థితిని తప్పించుకోవటం మూలాన్నే గందరగోళం, వైరుధ్యం, అవమానం, కోపం, అన్నీ వస్తున్నాయి. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాతో గాని, మరెవరితో గాని చెప్పనక్కరలేదు. కాని, మీరెలా ఉన్నారో మీకై మీరు తెలుసుకుని ఉండాలి - అది సంతోషకరమైనదైనా, సంతోషకరంకానిదైనా, ఎటువంటిదైనా, దానితోనే జీవించండి. దాన్ని సమర్థించటంగాని, ప్రతిఘటించటం గాని చెయ్యకుండా - దానికో పేరు పెట్టకుండా దానితో జీవించండి. పేరు పెట్టటమే దాన్ని ఖండించటమో, దానితో ఐక్యం కావటమో అవుతుంది. భయం లేకుండా దానితో జీవించండి - ఎందువల్లనంటే భయం దేన్నీ తెలుసుకోనివ్వదు. అదేమిటో తెలుసుకోకుండా దానితో జీవించలేరు. తెలుసుకుని ఉండటమంటే ప్రేమించటం. ప్రేమ లేకుండా గతాన్ని తుడిచి పెట్టలేరు. ప్రేమ ఉంటే గతం ఉండదు. ప్రేమే ఉంటుంది, కాలం ఉండదు.

58. భయం

ఆవిడ ఎంతో దూరం ప్రయాణం చేసింది. ప్రపంచంలో సగం భాగం దాటి వచ్చింది. ఎంతో జాగ్రత్త పడుతున్నట్లూ, రక్షించుకుంటూ ముందుకి సాగుతున్నట్లుగా ఉందావిడ. కొద్దిగా తెరుచుకుని, కాస్త లోతుగా తరచి చూచినట్లనిపిస్తే చాలు మూసుకుపోతోంది. ఆవిడ భీరువు కాదు. తన అంతరంగిక స్థితిని బయటపెట్టటం ఆవిడ కిష్టం లేదు. వ్యక్తం కాకపోయినా. అయినా, ఆవిడ తన గురించీ, తన సమస్యల గురించీ మాట్లాడాలని కోరుకుంటోంది. అసలు అంతదూరం నుంచి వచ్చింది కూడా అందుకే. ఏం మాట్లాడాలో స్పష్టంగా తెలియక ముడుచుకుపోతోంది. మళ్లీ తన గురించి చెప్పుకోవాలని ఆత్రుత. మనస్తత్వశాస్త్రం గురించి చాలా పుస్తకాలు చదివిందట. అయితే, ఎవరిచేతా విశ్లేషణ చేయించుకోలేదుట. తన్ను తాను విశ్లేషణ చేసుకోవటం బాగా చాతనవునుట. అసలు చిన్నప్పటి నుంచీ తన ఆలోచనలనూ, అనుభూతులనూ విశ్లేషణ చేసుకోవటం తనకు అలవాటేనని చెప్పిందావిడ.

మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలని పట్టుదల ఎందుకు మీకు?