పుట:Mana-Jeevithalu.pdf/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
183
స్వాభిమానం

మీకుతలవంపులు కలిగే మరోచర్యలో ఇరుక్కోవచ్చు. సంతోషం కలిగించని జ్ఞాపకాలను తుడిచి పెట్టేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అవుతుందా?

"అవుతుందనే అనుకున్నాను. కాకపోతే సమస్య ఏముంటుంది? మీరు దీన్ని మరింత గందరగోళం చెయ్యటం లేదూ? ఇప్పటికే గందరగోళంగా ఉంది, అంటే, నా జీవితం. దానికి ఇంకా కొంత బరువు చేర్చటం దేనికి?"

దానికి కొంత బరువు చేరుస్తున్నామా, లేక, ఉన్న స్థితిని అర్థం చేసుకోవటానికి, దాని నుంచి స్వేచ్ఛ పొందటానికీ ప్రయత్నిస్తున్నామా? దయచేసి మరి కొంత ఓర్పు వహించండి. గతాన్ని తుడిచి పెట్టెయ్యాలన్న తపన దేనివల్ల కలుగుతోంది మీలో? అది సంతోషకరమైనది కాకపోవచ్చు. దాన్ని తుడిచి పెట్టెయ్యటమెందుకు? మీ గురించి మీరే ఏర్పరచుకున్న భావంగాని, మీరు చిత్రించుకున్న చిత్రంగాని ఉంది. ఈ జ్ఞాపకాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల వాటిని వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ గురించి మీకు గౌరవభావం ఉంది. లేదా?

"తప్పకుండా ఉంది. లేకపోతే ...."

మనమంతా మనల్ని వివిధ అంతస్తుల్లో పెట్టుకుంటాం. ఆ ఎత్తుల మీంచి నిత్యం క్రిందికి పడిపోతూ ఉంటాం. ఈ పడిపోవటాలవల్లనే మనకి అవమానకరంగా ఉంటుంది. మన అవమానానికీ, మనం పడిపోవటానికీ కారణం స్వాభిమానమే. మనం అర్థం చేసుకోవలసినది ఈ స్వాభిమానాన్నే. అంతేకాని, పడిపోవటాన్ని కాదు. మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్న పీఠమే లేకపోతే దాన్నుంచి పడిపోవటం అనేది ఉండదు. మిమ్మల్ని మీరు ఆత్మగౌరవం, మనిషికి ఉండే హోదా, ఆదర్శం వంటి పీఠం మీద ఎందుకు నిలబెట్టుకున్నారు? దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే గతం వల్ల అవమానం పొందటం ఉండదు. అది పూర్తిగా పోతుంది. మీరు మీ పీఠం లేకుండా ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఆ పీఠం లేనట్లయితే, దాన్నుంచి పైకి గాని, క్రిందికి కాని చూచే ఎత్తే ఉండదు. ఇక, మీరు ఏది గ్రహించకుండా తప్పించుకుంటున్నారో ఆ అసలైన మీ స్థితిని మీరు గ్రహిస్తారు. ఈ ఉన్నస్థితిని, మీరున్న