పుట:Mana-Jeevithalu.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


57. స్వాభిమానం

ఆవిడ ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చింది. చిత్తశుద్ధితో వచ్చారు. తెలివితేటలతో వచ్చే ఒక దర్పంతో ఉన్నారు వాళ్లందరూ. ఒకాయన చెప్పినది తొందరగా గ్రహించగలడు. ఇంకొకాయన తన తొందరలో అసహనంగా ఉంటాడు. మూడో ఆయన ఆత్రుతగా ఉన్నాడు గాని, ఆ ఆత్రుతని నిలుపుకోలేక పోతున్నాడు. వారు ముగ్గురూ కలిస్తే బాగానే ఉంది. ముగ్గురూ తమ స్నేహితురాలి సమస్యలో భాగం పంచుకుంటున్నారు. ఎవ్వరూ సలహా ఇవ్వలేదు. విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చలేదు. సంప్రదాయం ప్రకారం గాని, నలుగురూ చెప్పిన ప్రకారంగాని, వ్యక్తిగతంగా తోచినట్లుగాని, ఆవిడ ఏది మంచిదనుకుంటే అది చెయ్యటంలో ఆవిడకి సహాయం చెయ్యాలని ముగ్గురూ కోరుతున్నారు. వచ్చిన కష్టమేమిటంటే, ఏది సరియైన పని? ఆవిడకే నిశ్చయంగా తెలియదు. ఆవిడకి ఇబ్బందిగానూ, కంగారుగానూ ఉంది. కాని తక్షణం ఏదో చర్య తీసుకోవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏదో నిర్ణయానికి రావాలి. ఆవిడ దాన్ని ఇంకా ముందుకి నెట్టటానికింక కుదరదు. ఒక ప్రత్యేక సంబంధం నుంచి విముక్తి పొందాలన్నది సమస్య. విముక్తి పొందాలనే ఉందావిడకి. ఆవిడ దాన్ని అనేకసార్లు పదేపదే చెప్పింది.

గదిలో నిశ్శబ్దంగా ఉంది. ఆ మానసిక ఆందోళన తగ్గింది. ఏవిధమైన ఫలితం ఆశించకుండా సరియైన పని ఏమిటన్నది నిర్ణయించకుండా సమస్యని పరిశీలించటానికి వాళ్లంతా ఆత్రుత పడుతున్నారు. సమస్యని బయట పెట్టగానే సరియైన పని ఏమిటో సంపూర్ణంగా దానంతటదే తేలుతుంది. సమస్యలో ఉన్నదంతా ఆవిష్కరించటం ముఖ్యం, అంతేకాని, ఆఖరున వచ్చే ఫలితం కాదు. ఏ సమాధానం వచ్చినా అది మరో నిర్ణయం, మరో అభిప్రాయం, మరో చిన్న సలహా అవుతుందేగాని సమస్యని ఏవిధంగానూ పరిష్కరించలేదు. అసలు సమస్యనే అర్థం చేసుకోవాలి. అంతేగాని, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, దానికోసం ఏం చెయ్యాలి అన్నది కాదు. సమస్యని సరియైన విధంగా సమీపించటం ముఖ్యం. ఎందువల్లనంటే సమస్యలోనే సరియైన చర్య ఇమిడి ఉంటుంది.