పుట:Mana-Jeevithalu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సొంతం చేసుకోవాలనే తత్వం

177

అయినప్పుడు నా భర్త గురించి నాకు బాగా తెలియదు. అదంతా ఎలా జరుగుతుందో మీకు తెలుసును. అసూయ క్రమంగా వ్యాపించింది వంటింట్లో పొగలా."

పురుషుణ్ణి గాని, స్త్రీని గాని ఆకట్టుకుని ఉంచుకోవటానికి అసూయ ఒక మార్గం కాదా? ఎంత ఎక్కువ అసూయపడితే అంత ఎక్కువగా తన సొంత చేసుకున్న భావన కలుగుతుంది. దేన్నైనా సొంతం చేసుకుంటే ఆనందం కలుగుతుంది. దేన్నైనా, కుక్కనైనా సరే మన ఒక్కరిదే అనుకుంటే ఎంతో హాయిగా సుఖంగా ఉన్నట్లుంటుంది. మన ఒక్కరి సొంతమే అయినప్పుడు ధైర్యం. విశ్వాసం కలుగుతాయి. దేన్నైనా మన సొంతం చేసుకుంటే, మనకి ప్రాముఖ్యం ఏర్పడుతుంది. ఈ ప్రాముఖ్యాన్నే పట్టుకు వ్రేలాడతాం. మనం సొంతం చేసుకున్నది ఒక పెన్సిలు కాదు, ఒక ఇల్లు కాదు, కాని, మనిషి అయినప్పుడు దానివల్ల శక్తి కలిగినట్లూ, వింతగా తృప్తికలిగినట్లూ అనిపిస్తుంది. ఈర్ష్య ఇంకొకరి మూలానకాదు. దాని విలువ మూలాన్నీ, మన ప్రాముఖ్యం మూలాన్నీ ఉంటుంది.

"కాని, నేను ముఖ్యమైన దాన్నికాదు. నేనేమీ కాను, నాకున్నదల్లా నాభర్తే. నా పిల్లలు కూడా లెక్కలోకి రారు."

మనమంతా, పట్టుకు వ్రేలాడేది ఒక్కదాని కోసమే - దాని రూపాలు వేరుకావచ్చు. మీరు మీ భర్తని, మరొకరు వారి పిల్లల్నీ, మరొకరు ఏదో నమ్మకాన్నీ పట్టుకు ప్రాకులాడతారు. ఉద్దేశం అందరిదీ ఒక్కటే. మనం దేనికోసం ప్రాకులాడుతున్నామో అది లేకుంటే మనం తప్పిపోయినట్లు భావిస్తాం. భావించమూ? మనం ఒంటరిగా ఉండాలంటే భయపడతాం. భయమే అసూయ, ద్వేషం, బాధ. అసూయకీ, ద్వేషానికీ అట్టే బేదం లేదు.

"కాని మాకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది."

అలా అయితే మీరు అసూయగా ఎలా ఉండగలరు? మనం ప్రేమించం. అదే దురదృష్టకరమైన విషయం. మీరు మీ భర్తని ఉపయోగించుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నట్లు గానే - మీరు సుఖంగా ఉండటానికీ, మీకో తోడు ఉండటానికీ, ఒంటరిగా ఉన్న భావం