పుట:Mana-Jeevithalu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
176
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పరిశుద్ధం కావటం వినేవారి మీద ఆధారపడి ఉండదు. హృదయాన్ని విప్పి చూపాలని కోరేవారిలోనే ఉంటుంది. తమ హృదయాన్ని విప్పి చూపటం ముఖ్యం - ఎవరో ఒకరు, ఏ ముష్టివాడో దొరుకుతాడు, వారి ముందు అంతా వెళ్లబోసుకోవటానికి. ఆత్మ పరిశీలన చేసుకునే వారు ఎన్నటికీ హృదయాన్ని విప్పి చూపలేరు. అది నాలుగు వైపులనుంచీ మూసేసి, నిస్పృహ కలిగించి, పూర్తిగా నిరుపయోగంగా ఉంటుంది. తెరవటమంటే వినటం - మిమ్మల్ని మీరే కాదు, మీపైన ఉన్న ప్రతి ప్రభావాన్నీ, మీలో కలిగే ప్రతి సంచలనాన్నీ వినాలి. మీరు విన్న దాన్ని గురించి మీరు ఇదమిద్ధంగా ఏదైన చెయ్యటానికి అవకాశం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కాని, తెరిచి ఉన్నదనే యథార్థమే దాని చర్య అది తీసుకుంటుంది. ఆ విధంగా వినటం వల్ల మీ హృదయం పరిశుద్ధమవుతుంది; మనస్సుకి సంబంధించినవన్నీ ప్రక్షాళితమవుతాయి. మనస్సుతో వినటం అంటే కబుర్లు చెప్పుకోవటం. అందులో మీకు గాని, ఎవరికి గాని విముక్తి ఉండదు. అది బాధని ఇంకా కొనసాగిస్తుంది. అది తెలివి తక్కువతనం.

తాపీగా తాము చెప్పదలుచుకున్న విషయానికి వస్తున్నారు.

"మా సమస్య గురించి మాట్లాడాలని వచ్చాం. మేము అసూయా పరులం - నేను కాదు, ఈవిడ. ఇదివరకు ఇప్పుడంత బాహాటంగా అసూయ కనపరచక పోయినా, ఎప్పుడూ సూచనగా తెలుస్తూనే ఉండేది. ఆవిడ అసూయపడే కారణాన్ని నేనెప్పుడూ కలిగించలేదు. కాని ఆవిడకెప్పుడూ ఏదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది."

అసూయ పడటానికి ఏదైనా కారణం ఉండాలనుకుంటున్నారా? అసూయకి కారణం ఉంటుందా? కారణం తెలియగానే అసూయ మాయమైపోతుందా? కారణం తెలిసిన తరువాత కూడా అసూయ అలాగే ఉంటుందని మీరు గమనించలేదా? కారణం కోసం వెతకొద్దు మనం. అసూయ అనేదాన్ని అర్థం చేసుకుందాం. మీరన్నట్లు ఏదో ఒక వంక దొరకచ్చు ఈర్ష్య పడటానికి. ఈర్ష్య అనేదాన్ని అర్థం చేసుకోవాలి, అది దేనివల్ల వచ్చిందో కాదు.

"అసూయ నాలో చాలాకాలం నుంచి ఉంది. మాకు వివాహం