పుట:Mana-Jeevithalu.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
167
సహజత్వం

అయినా. ఆయన సాధించే ఫలితం సంఘానికి ఎక్కువ లాభదాయకం కావచ్చు, ఆవిడ లక్ష్యం కన్నా. కాని, ప్రధానంగా రెండూ ఒక లాంటివే. ఒకటి రెండవదాని కన్న ఉన్నతమైనది కాదు. ఇద్దరూ వివేకం లేని వారే. ఇద్దరూ సూచించేది మనస్సు అల్పత్వాన్నే. అల్ప మనస్సు ఎప్పటికీ అల్పంగానే ఉంటుంది. దాన్ని సంపన్నంగా పుష్కలంగా చేయటం సాధ్యంకాదు. అటువంటి మనస్సు తన్ను తాను అలంకరించుకోవటమో, సద్గుణాలను సంపాదించటమో చేసినప్పటికీ, అది ఎప్పటిలాగే ఉంటుంది వెలితిగా. తామనుకునే వికాసం, అనుభవం - వీటి ద్వారా దాని అల్పత్వమే అధికమవుతుంది. అనాకారిగా ఉన్న దాన్ని అందంగా చెయ్యలేము. అల్పమనస్సు సృష్టించే దేవుడు అల్పదైవమే అవుతాడు. వెలితిగా ఉండే మనస్సు లోతు తెలియనంతగా మారదు - జ్ఞానంతోనూ గడుసు మాటలతోనూ, వివేకవంతుల మాటలను ఉదాహరించటంతోనూ ఎంత అలంకరించుకున్నప్పటికీ, బాహ్య రూపాన్ని ఎంత ముస్తాబు చేసినప్పటికీ. అలంకారాలు ఆంతరంగికమైనవైనా, బహిరంగంగా ఉన్నవైనా మనస్సుని లోతు తెలియనంతగా చేయవు. ఆ లోతు తెలియని ప్రగాఢమైన మనస్సే సౌందర్యాన్నిస్తుంది - అంతేకాని, ఆభరణమూ, పెంపొందించుకున్న సద్గుణమూ కాదు. సౌందర్యం కలగటానికి మనస్సు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తన అల్పత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకుంటూ ఉండటంలో పోల్చి చూడటం పూర్తిగా ఆపివెయ్యాలి.

ఆ అమ్మాయి అలవరచుకున్న ఠీవీ, ఆ ధర్మనిరతుడనని చెప్పుకునే ఆయన క్రమశిక్షణతో కూడిన ఠీవీ - రెండూ అల్పమనస్సు చిత్రహింసతో సాధించిన ఫలితాలే. అత్యవసరమైన సహజత్వాన్ని పూర్తిగా వదులుకున్నారు. ఇద్దరికీ సహజత్వం అంటే భయమే - తాము వాస్తవంగా ఉన్న స్థితి తమకూ, ఎదుటి వారికీ బయటపడుతుందేమోనని. ఇద్దరూ దాన్ని నాశనం చెయ్యటానికే పూనుకున్నారు. వారి సఫలతకి కొలమానం ఏమిటంటే, వారు ఎంచుకున్న పద్ధతికీ, నిశ్చితాభిఫ్రాయానికీ పూర్తిగా అనుగుణంగా ఉండటమే. కాని ఉన్న స్థితిని తెరిచి చూపే సాధనం ఒక్క సహజమైన స్పందనే. అప్రయత్నంగా జరిగే ప్రతిక్రియ మనస్సుని ఉన్నదున్నట్లుగా తెరిచి చూపుతుంది.