పుట:Mana-Jeevithalu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కూడా ఉంది. కుతూహలం కొద్దీ వచ్చి ఉండచ్చు, లేదా, స్నేహితులెవరైనా తీసుకొస్తే వచ్చి ఉండవచ్చు. మంచి దుస్తులు వేసుకుంది. హుందాగా ఉంది. తను చాలా అందంగా ఉంటానని ఆవిడ అనుకుంటోందన్నది స్పష్టమే. ఆవిడ తన గురించే అన్నీ ఆలోచిస్తున్నట్లుగా ఉంది - తన శరీరం, తన అందం, తన జుట్టు, తను ఇతరుల మీద కలిగిస్తున్న ప్రభావం - ఇదంతా. ఆవిడ చేష్టలు జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నట్లుగా ఉన్నాయి. మధ్యమధ్య వివిధ ధోరణులను ప్రదర్శించింది ముందుగానే ఎంతో జాగ్రత్తగా ఆలోచించి. ఆవిడ ధోరణి అంతా ఎంతో కాలం నుంచి అలవాటు చేసుకున్న ఠీవి, దానిలో ఎలాగైనా ఏం జరిగినా సరే ఇమిడిపోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లుగా ఉంది. తక్కిన వాళ్లు ఏవో గంభీర విషయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ గంటసేపూ ఆవిడ అదే ఠీవిలో ఉంది. ఆ గంభీరమైన, తీవ్రమైన ముఖాల మధ్య తనగురించే ఆలోచిస్తున్న ఆ అమ్మాయి ఆ చెబుతున్నదాన్ని వింటూ చర్చలో పాల్గొనటానికి ప్రయత్నిస్తోంది. కాని, ఆవిడ నోటివెంట మాటలు వెలువడలేదు. చర్చిస్తున్న సమస్య గురించి తనకు కూడా తెలుసునన్న విషయాన్ని ప్రదర్శించాలని కోరుతోంది. కాని, ఆమె కన్నుల్లో కంగారు - తను ఆ గంభీర సంభాషణలో పాల్గొన లేకపోతున్నానని. అంతలోనే తనలో తాను ముడుచుకుని పోతున్నట్లు కనిపించింది, కాని తాను ఎంతోకాలం నుంచి అలవరచుకున్న ఆ ఠీవిలోనే ఉందింకా. సహజత్వాన్ని ప్రయత్న పూర్వకంగా నాశనం చేయటం జరుగుతోంది.

ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఠీవి అలవరచుకుంటారు. ఒకవైపు స్థితిమంతుడైన వ్యాపారస్థుని నడకా, ఠీవీ, విజయాన్ని సూచించే అతని చిరునవ్వూ; మరోవైపు కళాకారుడి రూపం, ఠీవీ; ఇంకో పక్కన వినయ విధేయతలు కల శిష్యుడు, ఆ పక్కని క్రమశిక్షణ పొందిన సాధువు ఠీవి. తన గురించే ఆలోచించే ఆ అమ్మాయి లాగే ఆ ధర్మనిరతుడనుకునే అతని ఠీవి, క్రమశిక్షణతో ప్రయత్న పూర్వకంగా ఎన్నో వదులుకుని త్యాగంచేసి, కావాలని అలవరచుకున్నదే. ఆవిడ ఒక విధంగా ఉండాలనే ప్రయత్నంలో సహజత్వాన్ని త్యాగం చేస్తున్నట్లుగానే ఆయన తన లక్ష్యం కోసం తనని తాను బలిదానం చేసుకుంటాడు. ఇద్దరికీ కావలసినది లక్ష్యసాధనే - వేరు వేరుస్థాయిల్లో