పుట:Mana-Jeevithalu.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
164
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కాదా? మనం చేతుల్లో చేతులు పెట్టుకుంటాం. ఆ మరుక్షణం తిట్టిపోస్తాం. ఎంతో కఠినమైన మాటలంటాం. తరువాత ముద్దుపెట్టుకుని సమాధాన పడతాం. ఇదంతా ప్రేమకాదా? అసలు అసూయ ఉందంటేనే ప్రేమ ఉందన్న సూచన. వెలుగు - చీకటిలాగ - ఆ రెండూ జంటగా ఉంటాయి. ముక్కుమీద కోపం, ముద్దుపెట్టుకోవటం - ఈ రెండూ కలిస్తేనే కదా ప్రేమ. నది కల్లోలం గానూ ఉంటుంది. ప్రశాంతంగానూ ఉంటుంది. నీడలోనూ ప్రవహిస్తుంది, ఎండలోనూ ప్రవహిస్తుంది. అందులోనే ఉంది ఆ నదికి అందం."

మనం ప్రేమ అనేదేమిటి? అసూయ, కామం, కఠిన వాక్కులు, కౌగిలింతలు, చేతులు పట్టుకోవటాలు, తగువులాడుకోవటం, మళ్లీ కలుసుకోవటం - ఇవన్నీ కలిసినది. ఇవన్నీ ప్రేమ అనబడేదానిలోని వాస్తవాలు. ఈ రంగంలో కోపగించుకోవటం, కౌగిలించుకోవటం - ఈ రెండూ దైనందిన యథార్థాలు, కాదా? వివిధ వాస్తవాల మధ్య సంబంధం ఏర్పరచటానికి గాని, వాటిని ఒక దానితో ఒకటి పోల్చటానికి గాని ప్రయత్నిస్తాం. అదే రంగంలోని ఒక వాస్తవాన్ని మరో వాస్తవంతో పోల్చి దాన్ని ఖండించటమో సమర్థించటమో చేస్తాం, లేదా, ఆ రంగంలోని ఒక వాస్తవాన్ని దాని కవతలగా మరో రంగానికి చెందిన వాస్తవంతో సంబంధం ఏర్పరచటానికి ప్రయత్నిస్తాం. ప్రతి యథార్ధాన్నీ విడిగా తీసుకోకుండా ఒక దానికీ మరొక దానికీ మధ్య సంబంధం వెతకటానికి ప్రయత్నిస్తాం. మనం ఎందుకు చేస్తాం ఇలా? ఒక యథార్థాన్ని అదే రంగంలోని మరో యథార్థం ద్వారా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించకుండా ఉన్నప్పుడే ఆ యథార్థం అర్థమవుతుంది. అలా కాకపోయినట్లయితే సంఘర్షణా, అయోమయ స్థితీ సృష్టించటమవుతుంది. అదే రంగంలోని రెండు వాస్తవాలను మనం ఎందుకు పోల్చుతాం? ఒక వాస్తవాన్ని తేటతెల్లం చేయటానికి గాని, వివరంగా తెలియజేయటానికి గాని మరో వాస్తవం యొక్క ప్రాధాన్యాన్ని ఎందుకు వాడుకుంటాం?

"మీరు చెప్పిన దాంట్లోని అర్ధాన్ని ఇప్పుడే గ్రహించగలుగుతున్నాను. అయితే, మనం ఎందుకు చేస్తాం అలా?"

మనం యథార్ధాన్ని భావం అనే తెరద్వారా, జ్ఞాపకం అనే తెర ద్వారా చూడగలమా? మీ చెయ్యి పట్టుకున్నందువల్ల అసూయ అర్థమవుతుందా