పుట:Mana-Jeevithalu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నది, ఉండవలసినది

155

సమయం ప్రశ్న కాదది. గతాన్ని పెకిలించటమూ, జాగ్రత్తగా పరికించటమూ - అణచిపెట్టబడింది అనే సత్యాన్ని దర్శించటమే. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అనాసక్తంగా తెలుసుకోవటం జరిగినట్లయితే, మొత్తం అణచిపెట్టటం అనే ప్రక్రియని - ఆ సత్యాన్ని తక్షణం గ్రహించటం జరుగుతుంది. నిన్న, రేపు - అనే సందర్భంలో ఆలోచిస్తూ ఉంటే అణచిపెట్టటం అనే సత్యాన్ని కనుక్కోవటం సాధ్యం కాదు. సమయం గడుస్తున్న కొద్దీ అవగతమయేది కాదు సత్యం. సాధించి పొందగలిగేది కాదు సత్యం. దాన్ని గ్రహించాలి, లేదా గ్రహించకుండా ఉండాలి. దాన్ని క్రమంగా గ్రహించటానికి వీలవదు. అణచివేత నుంచి విముక్తి పొందాలన్న ఇచ్ఛ దాని గురించిన సత్యాన్ని తెలుసుకోవటంలో అవరోధమవుతుంది. 'ఇచ్ఛే, కోరిక - వ్యక్తమైనదైనా అవ్యక్తమైనదైనా, కోరిక ఉన్నప్పుడు అనాసక్తంగా గమనించడం ఉండదు. కోరిక, లేదా తాపత్రయం వల్లనే అణచివేత సంభవిస్తుంది. ఈ కోరికనే ఇప్పుడు ఇచ్ఛ అంటున్నా, తన సృష్టి నుంచి తాను విముక్తి పొందలేదు. మళ్లీ, ఇచ్ఛ అనే సత్యాన్ని కూడా అనాసక్తంగా చురుకుగా తెలుసుకొంటూ గ్రహించాలి. పరిశీలకుడు పరిశీలించే దాన్నుంచి తన్ను తాను వేరు చేసుకున్నా, దానిలోని భాగమే అతడు కూడా. పరిశీలించే దానివల్ల ప్రభావితుడైన వాడు కాబట్టి దాన్నుంచి విముక్తి పొందలేడు. ఈ సత్యాన్ని కూడా గ్రహించాలి. సత్యమే విముక్తి కలిగిస్తుంది. అంతేకాని, ఇచ్ఛా, ప్రయత్నమూ కాదు.

50. ఉన్నది, ఉండవలసినది

"నాకు వివాహం అయింది. పిల్లలున్నారు." అని చెప్పిందావిడ. "కాని, నాలోని ప్రేమ అంతా పోయింది. నేను క్రమంగా ఎండిపోతున్నాను. ఏదో కాలక్షేపం క్రింద సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పటికీ, అవి ఎంత వ్యర్థమో గ్రహించాను. నాకు ప్రగాఢంగా, సంపూర్ణంగా ఆసక్తి కలిగించేదేదీ లేదనిపిస్తోంది. ఈ మధ్య ఇంటిపనుల నుంచీ, సాంఘిక కార్యకలాపాల నుంచీ చాలాకాలంపాటు సెలవు తీసుకుని చిత్రలేఖనం ప్రయత్నించాను. కాని నా మనస్సు అందులోనూ లేదు. పూర్తిగా చచ్చిపోయినట్లూ సృజనాత్మకత