పుట:Mana-Jeevithalu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమస్యలు - తప్పించుకునే మార్గాలు

153

సృష్టించిన దాన్ని గురించిన ఆలోచన - అది మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియక భయాన్ని మందకొడితనాన్నీ కలుగజేస్తుంది. సమస్యల గురించి ఆదుర్దా లేకపోతే మతిపోయినట్లుంటుంది. మనస్సు వాటివల్లనే బ్రతుకుతోంది. అవి ప్రపంచ సమస్యలైనా, వంటింటి సమస్యలైనా, రాజకీయాలైనా, వ్యక్తిగత వ్యవహారాలైనా, మతానికి సంబంధించినవైనా, సిద్ధాంతానికి సంబంధించినవైనా. అందువల్ల మన సమస్యలే మనల్ని అల్పంగా, సంకుచితంగా ఉండేట్లు చేస్తాయి. ప్రపంచ సమస్యల గురించి బాధపడే మనస్సు ఎంత అల్పమైనదో, ఆధ్యాత్మిక వికాసం పొందటం విషయంలో బాధలు పడుతున్న మనస్సూ అంతే అల్పమైనది. సమస్యల వల్ల భయంతో మనస్సు బరువెక్కిపోతుంది. ఎందుచేతనంటే, సమస్యలు అహానికి, - "నేను" అనేదానికి, "నా" అనేదానికి శక్తినిస్తాయి. సమస్యలు లేకుండా జయాపజయాలు లేకుండా ఉంటే "నేను" అన్నది లేదు.

"కానీ "నేను" అన్నది లేకుండా ఎవరైనా ఎలా బ్రతకగలరు? చర్య అంతటికీ మూలం అదేకదా."

కోరిక, జ్ఞాపకం, సుఖదుఃఖాలంటే భయం - వీటి ఫలితంగా చర్య జరిగినంతకాలం అది సంఘర్షణనీ, గందరగోళాన్నీ, వైరుధ్యాన్ని పెంపొందించి తీరుతుంది. మన చర్య మనం పొందిన ప్రభావాన్ని బట్టి ఉంటుంది - ఏ స్థాయిలోనైనా. క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన ప్రతిక్రియ అసంతుష్టికరంగా, అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి సంఘర్షణ బయలుదేరి తీరాలి - అదే సమస్య. అహం స్వరూపంలోనే సంఘర్షణ ఉంది. సంఘర్షణ లేకుండా, దురాశ, భయం, విజయం - వీటి సంఘర్షణ లేకుండా జీవించటానికి పూర్తిగా అవకాశం ఉంది. కాని, ప్రత్యక్షానుభవం ద్వారా కనుక్కునే వరకూ ఈ అవకాశం కేవలం సిద్ధాంతరూపంలోనే ఉంటుంది - వాస్తవంగా కాదు. అహం రీతుల్ని అర్థం చేసుకున్నప్పుడే దురాశ లేకుండా బ్రతకటం సాధ్యమవుతుంది.

"నా చెవుడు నా భయాలవల్లనూ, అణచి పెట్టిన అనుభూతుల వల్లనూ అంటారా? చెవి నిర్మాణంలో ఏ విధమైన లోపమూలేదని డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. నేను మళ్లీ వినగలిగే అవకాశం ఉంటుందంటారా? నా జీవిత