పుట:Mana-Jeevithalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"కాని, మీరు అసంభవమైన దాన్ని అడుగుతున్నారు! మన విద్యాభ్యాసం మన మనస్సుకి విచక్షణ చేయగలిగేలా, పోల్చేలా, నిర్ణయించేలా, ఎంచుకునేలా నేర్పుతుంది. దేన్నైనా గమనించినప్పుడు ఖండించకుండానో, సమర్ధించకుండానో ఉండటం చాలా కష్టం. ఈ ప్రభావం నుంచి తప్పించుకుని నిశ్శబ్దంగా గమనించటం ఎలా?"

నిశ్శబ్దంగా గమనించటం, ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకోవటం అవగాహనకి ముఖ్యావసరమని మీరు గ్రహించినట్లయితే మీరు గ్రహించిన దానిలోని సత్యం మిమ్మల్ని మీగతం నుంచి విముక్తి చేస్తుంది. అనాసక్తంగా, చురుకుగా తెలుసుకోవటం తక్షణం అవసరం అని మీరు గ్రహించినప్పుడే "ఎలా" అనే ప్రశ్నా, మీ గతాన్ని రూపుమాపే మార్గం కోసం ప్రయత్నం బయలు దేరతాయి. సత్యమే విముక్తి కలిగిస్తుంది - సాధనమూ, పద్ధతీ కాదు. నిశ్శబ్దంగా గమనించటం వల్లనే అవగాహన కలుగుతుందనే సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఖండన నుంచీ, సమర్ధన నుంచీ మీకు విముక్తి కలుగుతుంది. మీరు ప్రమాదాన్ని చూడగానే దాన్ని తప్పించుకోవటం ఎలా అని మీరు అడగరు. ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకునే అవసరాన్ని మీరు గ్రహించటం లేదు కనుకనే మీరు "ఎలా" అని అడుగుతున్నారు. దాని అవసరాన్ని మీరు ఎందుకు గ్రహించరు?

"నాకు గ్రహించాలనే ఉంది. కాని, ఈ విధంగా నేనిదివరకెన్నడూ ఆలోచించలేదు. నేను చెప్పగలిగిందల్లా నా సమస్యల్ని వదిలించుకోవాలని కోరుతున్నాను. అవి నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నాకు హాయిగా ఉండాలని ఉంది అందరి మాదిరిగా."

అనాసక్తంగా ఉంటూ, నిశ్చలంగా ఉంటూ తెలుసుకోవాలనే ముఖ్యావసరాన్ని గ్రహించటానికి అంగీకరించం - వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని - నిజంగా మనం ఆ సమస్యల్ని దూరం చేసుకోవాలని కోరటం లేదు కనుక. అవి లేకపోతే మనం ఎలా ఉంటాం? మనకి తెలిసిన దాన్ని పట్టుకుని ఎలాగో వ్రేలాడతాం - అదెంత బాధాకరమైనదైనాసరే. అంతేకాని, మనల్ని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియని కొత్తదాన్ని ప్రయత్నించటానికి సాహసించం. సమస్యలు ఎంతైనా, మనకి పరిచితమైనవి. కాని, వాటిని