పుట:Mana-Jeevithalu.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


49. సమస్యలు - తప్పించుకునే మార్గాలు

"నాకెన్నో తీవ్ర సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించి, అవి మరింత క్లిష్టంగా బాధాకరంగా అయేటట్లు చేశానేమో అనిపిస్తోంది. నాకు మతిపోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. వీటన్నిటికీ తోడు నాకు వినిపించదు. వినిపించటానికి చెవిలో పెట్టుకునే పీడ - ఇదొకటి నాకు. నాకు బోలెడు మంది పిల్లలు, నా భర్త నన్నొదిలేశాడు. నా పిల్లల గురించే నాకు బాధ. నేను పడిన దురవస్థలన్నీ వాళ్లు తప్పించుకోవాలని నా కోరిక."

మన సమస్యలకి పరిష్కారం కనిపెట్టాలని ఎంత ఆదుర్దా మనకి! పరిష్కారం కనిపెట్టాలని ఎంత ఆత్రుత పడతామంటే, సమస్యని పరిశీలించనే లేము. సమస్యని ప్రశాంతంగా గమనించనివ్వదు. సమస్యే ముఖ్య విషయం - పరిష్కారం కాదు. పరిష్కారం కోసం వెతికితే దొరుకుతుంది. కానీ, సమస్య అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఆ పరిష్కారానికి సమస్యతో సంబంధం లేదు. మన అన్వేషణ సమస్యను తప్పించుకునే మార్గంకోసం. పరిష్కారం పైపైన వాడే మందే. అంచేత సమస్యని అవగాహన చేసుకోవటం అవదు. అన్ని సమస్యలకీ ఒక్కటే మూలం. ఆ మూలాన్ని అర్థం చేసుకోకుండా సమస్యని పరిష్కరించటానికి ఏ ప్రయత్నం చేసినా అది మరింత గందరగోళానికీ, దుస్థితికీ కారణమవుతుంది. సమస్యని అర్థం చేసుకోవాలనే ఉద్దేశం గంభీరమైనదనీ, అన్ని సమస్యల నుంచీ విముక్తి పొందవలసిన అవసరం ఉన్నదనీ ముందుగా స్పష్టమవాలి. అప్పుడే సమస్యల్ని సృష్టించిన దాన్ని సమీపించవచ్చు. సమస్యలనుంచి విముక్తి కలగకుండా ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు. ప్రశాంతత ఆనందానికి అత్యవసరం. కాని, ఆనందం లక్ష్యం కాదు. గాలి ఆగిపోయినప్పుడు సరస్సు నిశ్చలంగా ఉన్నట్లు సమస్యలు పోగానే మనస్సు కూడా నిశ్చలమవుతుంది. కాని, మనస్సుని నిశ్చలంగా చెయ్యలేము. అలా అయితే అది చచ్చిపోయినట్లే. అది చలనంలేని నీటి మడుగు. ఇది స్పష్టమైనప్పుడు సమస్యల్ని సృష్టించే దాన్ని గమనించవచ్చు. ఈ గమనించటం నిశ్శబ్దంగా జరగాలి - సుఖదుఃఖాలను బట్టి ముందుగానే నిర్ణయించుకున్న పథకం ప్రకారం కాదు.