పుట:Mana-Jeevithalu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

భావం జ్ఞాపకానికి ఫలితం. జ్ఞాపకాన్ని మాటలలో పొందుపరచటమే భావం. భావం సమస్యనీ, జీవితాన్నీ ఎదుర్కోవటానికి సరిపోని ప్రతిక్రియ. జీవితాన్ని ఎదుర్కోవటానికి సరిపోయే ప్రతిక్రియ చర్య. అంతేకాని భావం కాదు. చర్య తీసుకోకుండా మనల్ని మనం రక్షించుకోవటానికి భావనాత్మకంగా ఎదుర్కొంటాం. భావాలు చర్యని పరిమితం చేస్తాయి. భావాల ఆవరణలో రక్షణ ఉంటుంది - చర్యలో కాదు. అందుచేత చర్యని భావానికి లొంగి ఉండేటట్లు చేయటం జరుగుతుంది. చర్య తీసుకునేందుకు ఏర్పరచుకున్న ఆత్మరక్షణ పథకమే భావం. తీవ్రమైన అవాంతరంలో చర్య సూటిగా ఉంటుంది - భావంతో సంబంధ లేకుండా. ఇలాంటి తక్షణచర్య జరగకుండానే మనస్సు తనకు తాను క్రమశిక్షణ నిచ్చుకుంటుంది. దాదాపు మనందరి లోనూ మనస్సుకి ఆధిపత్యం ఉంటుంది. భావాలు చర్యని నిగ్రహించేట్లు పనిచేస్తాయి. అందువల్లనే చర్యకీ, భావనకీ సంఘర్షణ ఉంటుంది.

"నా మనస్సు ఎంగాడిన్‌లో జరిగిన అందమైన అనుభవం వైపే పరుగులిడుతోంది. అది ఆ అనుభవాన్ని జ్ఞాపకం ద్వారా పునరుజ్జీవింప చేసుకోవటమేనా?"

నిశ్చయంగా, వాస్తవమైనది మీ ప్రస్తుత జీవితం. ఈ జనంతో కిక్కిరిసిన వీది, మీ పని, మీ దగ్గర సంబంధాలు. ఇవి సంతోషదాయకంగానూ, సంతృప్తికరంగానూ ఉన్నట్లయితే ఎంగాడిన్ మసక మసగ్గా అయిపోతుంది. కాని, వాస్తవంగా ఉన్నది గందరగోళంగానూ, బాధాకరంగానూ ఉంది. మీరు ఎప్పుడో జరిగిన దానివైపుకి, గతించిపోయిన అనుభవం వైపుకి మళ్లుతున్నారు. కాని, అది అంతమైపోయింది. జ్ఞాపకం ద్వారా మాత్రమే దానికి ప్రాణం పోస్తున్నారు - చచ్చిపోయిన దాంట్లో ప్రాణం దూర్చటానికి ప్రయత్నిస్తున్నట్లు. ప్రస్తుతం ఉన్నది అనాసక్తికరంగా వెలితిగా ఉండటంతో, గతం వైపుకో, స్వయం కల్పితమైన భవిష్యత్తు వైపుకో మళ్లుతాం. ప్రస్తుతం నుంచి ఇలా పారిపోవటం భ్రమకి దారితీయక తప్పదు. ప్రస్తుతాన్ని ఉన్నదున్నట్లు ఖండన లేకుండా సమర్థన లేకుండా చూడటం ఉన్నదాన్ని అవగాహన చేసుకోవటమే. అప్పుడే చర్య సంభవమవుతుంది. అటువంటి చర్య ఉన్న స్థితిలో పరివర్తన తెస్తుంది.