పుట:Mana-Jeevithalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తేజం

149

ఉత్తేజాల్లోనూ ఒక సామాన్య లక్షణం ఉంది - ఉన్న స్థితి నుంచీ, మన దినచర్య నుంచీ, సజీవంగా లేని సంబంధం నుంచీ, ఎప్పటికప్పుడు పాతబడే జ్ఞానం నుంచీ పారిపోవాలనే కోరిక. మీరొక మార్గం ఎంచుకుంటారు. నేనొకదాన్ని ఎంచుకుంటాను. నేను ఎంచుకున్న ప్రత్యేక రకం మీ దానికన్న ఎక్కువ లాభదాయకమని ఎప్పుడూ భావిస్తాను. కాని, తప్పించుకునే మార్గం ఏ రూపంలోనైనా - ఆదర్శమైనా, సినిమా అయినా, చర్చి అయినా - హానికరమైనదే. భ్రమకీ, అఘాతానికీ దారి తీస్తుంది. స్పష్టంగా కనిపించే వాటికన్న మానసికమైన మార్గాలు మరింత హానికరమైనవి. అవి సూక్ష్మమైనవీ, క్లిష్టమైనవీ కాబట్టి కనిపెట్టటం ఎక్కువ కష్టం. ఉత్తేజం ద్వారా ఉదయింప జేసిన నిశ్శబ్దం, క్రమశిక్షణల ద్వారా, నిగ్రహాల ద్వారా, ప్రతిఘటనల ద్వారా - వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని - సాధించిన నిశ్శబ్దం ఒక ఫలితం, ఒక ప్రభావం మాత్రమే. అందుచేత సృజనాత్మకమైనది కాదు. అది గతించిపోయినదే.

నిశ్శబ్దం అనేది - మరొకదానికి ప్రతిక్రియ కానిది, ఫలితం కానిది, ఉత్తేజం వల్లా, అనుభూతి వల్లా ఉదయించని నిశ్శబ్దం - నిర్మింపబడినదీ. నిశ్చయింపబడినదీ కాదు. అది ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకున్నప్పుడు సాక్షాత్కారమవుతుంది. ఆలోచన జ్ఞాపకానికి ప్రతిక్రియ. వ్యక్తమైనవి గాని, అవ్యక్తమైనవి గాని, నిశ్చితాభిప్రాయాలకు ప్రతిక్రియ ఆలోచన. ఈ జ్ఞాపకం సంతోషాన్ని బట్టిగాని బాధని బట్టిగాని చర్యని శాసిస్తుంది. ఆవిధంగా భావాలు చర్యపై అధికారం చెలాయిస్తాయి. అందుచేత చర్యకీ, భావానికీ మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఈ సంఘర్షణ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అది తీవ్రమవుతున్న కొద్దీ దాన్నుంచి విముక్తి పొందాలనే తపన కలుగుతుంది. కాని, ఈ సంఘర్షణ అర్థమై పరిష్కారమయేవరకూ దాన్నుంచి విముక్తి పొందాలని ఏ ప్రయత్నం చేసినా అది తప్పించుకునే మార్గమే అవుతుంది. చర్య భావాన్ని పోలి ఉండటానికి యత్నం జరుగుతున్నంత వరకూ సంఘర్షణ అనివార్యం. చర్య, భావం నుండి విడివడినప్పుడే సంఘర్షణ అంతమవుతుంది.

"కాని చర్య ఎప్పటికైనా భావం నుంచి విడిపోగలదా? భావన లేకుండా చర్య అనేది సాధ్యం కాదు నిశ్చయంగా. చర్య భావాన్ని అనుసరిస్తుంది. భావం ఫలితంగా జరగని చర్యని నేను ఊహించలేనేమో."