పుట:Mana-Jeevithalu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అనుభవం. ఆ నిశ్శబ్దాన్ని - సజీవంగా స్పందించే, సంచలించే ఆ నిశ్శబ్దాన్ని అలాగే పట్టుకుని ఉండగలిగితే బాగుండుననిపించింది. మీరు చెప్పే నిశ్శబ్దం నేను పొందిన ఈ అసాధారణమైన అనుభవం లాంటిదేననుకుంటాను. నేను అనుభవం పొందిన నిశ్శబ్దానికి ఉన్న లక్షణాలున్నదేనా మీరు చెప్పేది కూడా - అన్న విషయాన్ని నిజంగా తెలుసుకోవాలని ఉంది నాకు. ఆ నిశ్శబ్దం ప్రభావం చాలాకాలం దాకా ఉంది. ఇప్పుడు, దాన్ని మళ్లీ అందుకుని దానిలోనే జీవించటానికి ప్రయత్నిస్తున్నాను."

ఎంగాడిన్ మిమ్మల్ని నిశ్శబ్దంగా చేసింది. మరొకొర్ని ఒక అందమైన మానవాకారం, వేరొకర్ని ఒక దివ్యగురువో, ఒక పుస్తకమో, తాగుడో నిశ్శబ్దంగా చేస్తుంది. బాహ్య ఉత్తేజం ద్వారా ఎవరైనా ఒక అనుభూతికి లోనవుతారు. దాన్నే నిశ్శబ్దం అంటారు. అది విపరీతమైన సంతోషాన్ని కలిగిస్తుంది. రోజూ ఉండే సమస్యల్నీ, సంఘర్షణలనీ అవతలికి తోసేసి తేలిగ్గా చేసుకోవటమే ఆ అందమూ, మాహాత్య్మమూ యొక్క ప్రభావం. బాహ్య ఉత్తేజంతో మనస్సు తాత్కాలికంగా శాంతి నొందుతుంది. అదొక కొత్త అనుభవం, కొత్త ఉల్లాసం కావచ్చు. దాన్నింక మళ్లీ అనుభవం పొందుతూ ఉండనప్పుడు, మనస్సు దాన్నొక జ్ఞాపకంగా తలుచుకుంటుంది. పర్వతాల్లో ఉండిపోవటం సాధ్యం కాకపోవచ్చు. మళ్లీ వెళ్లి తమ పనిలో తాము చేరాలి. కాని, ఆ ప్రశాంత స్థితి మరొకరకమైన ఉత్తేజం ద్వారా, తాగుడు ద్వారా, మనిషి ద్వారా, ఊహద్వారా తిరిగి పొందటానికి ప్రయత్నించటం సాధ్యమే. అదే మనలో చాలామంది చేసేది. ఇవన్ని వివిధ రకాలైన ఉత్తేజాలు - మనస్సుని నిశ్చలం చెయ్యటానికి సాధనాలు. అందుచేత సాధనాలు ప్రధానమవుతాయి, ముఖ్యమవుతాయి. మనం వాటికి బంధితులమవుతాం. సాధనం మనకి నిశ్శబ్దం అనే సుఖాన్నిస్తుంది. కాబట్టి అది మన జీవితంలో ఆధిపత్యం వహిస్తుంది. అదే మన ముఖ్య ఆసక్తి మానసికావసరం. దాన్ని రక్షించుకుంటాం. దానికోసం అవసరమైతే ఒకరినొకరం నాశనం చేసుకుంటాం. సాధనం, అనుభవం స్థానంలో ఉంటుంది. అదిప్పుడు కేవలం జ్ఞాపకం మాత్రమే.

ఉత్తేజాలు అనేక విధాలుగా ఉండొచ్చును. మనిషిపై ఉన్న ప్రభావాన్ని బట్టి ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉండొచ్చును. కాని, అన్ని