పుట:Mana-Jeevithalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పెంచుకోవటం ఆత్మవంచన. తనలోని వెలితిని తప్పించుకోవటానికి అదొక మార్గం. మనం బంధనం పెంచుకునేవి - ఆస్తి, మనుషులూ, ఊహలూ - ఇవి అత్యంత ముఖ్యం అవుతాయి, శూన్యాన్ని నింపే అవన్నీ లేకపోతే తనే ఉండడు కనుక. ఉండడేమోనన్న భయంతో సొంతం చేసుకుంటారు. భయం భ్రమని పెంపొందిస్తుంది. నిశ్చితమైన వాటి బంధనంలో ఉండటమే భ్రమ - నిశ్చితమైనవి వస్తువులైనా, భావాలైనా; వివేకం, స్వేచ్ఛా ఉన్నప్పుడే వాస్తవికత తెలియటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ లేకుండా కపటత్వాన్ని వివేకం అనుకుంటారు. కపటంగా ఉండేవారి పద్ధతులెప్పుడూ గందరగోళంగా, వినాశకరంగా ఉంటాయి. ఈ ఆత్మరక్షకమైన కపటత్వమే. బంధనాలు ఏర్పరచుకునేట్లు చేస్తుంది. బంధనం బాధ కలిగించినప్పుడు కపటత్వమే బంధనం వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంది. పైగా త్యజించటాన్ని గర్వంగా, గొప్పగా భావించి, అందులో సంతోషాన్ని పొందుతుంది. కపట రీతులూ, ఆత్మ అవలంబించే మార్గాలూ అర్థం కావటమే వివేకానికి ఆరంభం.


46. వెర్రిభ్రమ

ఆయనకి చిన్నచిన్న విషయాల గురించి వెర్రిభ్రమలు ఉన్నాయన్నాడు. వెర్రిభ్రమలు నిత్యం మారుతూ ఉంటాయిట. ఏదో శారీరక లోపం ఊహించుకుని దాన్ని గురించే ఆదుర్దా పడుతూ ఉంటాడుట, కొన్ని గంటలయింతరవాత దాని స్థానంలో మరో సంఘటనో, ఆలోచనో చోటు చేసుకుంటుందిట. ఆదుర్దా కలిగించే ఒక వెర్రిభ్రమలో నుంచి మరొక వెర్రిభ్రమలో పడి బ్రతుకుతున్నట్లు ఉందిట. ఈ వెర్రిభ్రమలను జయించటానికి వాటి గురించి పుస్తకాలు చదువుతాడుట. ఎవరైనా స్నేహితుడితో తన సమస్య చెప్పుకుంటాడు. ఒక మనస్తత్వ పరిశీలకుడి దగ్గరికి కూడా వెళ్లాడుట. అయినా, ఏ విధంగానూ బాధ నివారణ కాలేదుట. ఎంతో గంభీరమైన, ఆసక్తికరమైన సమావేశాల్లో పాల్గొన్న తరవాత తక్షణం మళ్లీ ఈ వెర్రి భ్రమలు ప్రవేశిస్తాయిట. వాటి కారణం ఆయన తెలుసుకోగలిగితే వాటిని అంతం చెయ్యటానికి వీలవుతుందా?