పుట:Mana-Jeevithalu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
136
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ప్రయత్నిస్తున్నాడు గాని, ఆయన మనస్సు మళ్లీ మళ్లీ పారిపోతోంది. ఆఖరికి ఆ పోరాటం ఆపేసి, మనస్సుని దాని త్రోవని దాన్ని వదిలేశాడు. ఒక లారీ కొండమీది నుంచి క్రిందికి మెల్లిగా భారంగా వస్తోంది. దాని వేగం ఇంకా తగ్గించవలసి వచ్చింది.

క్రియారూపంలో పెట్టటానికి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం - పైకి కనిపించే చేష్టల రూపంలో ముందు బాహ్యంగా ఒక క్రమపద్ధతి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. మన తీర్మానాల ప్రకారం అంతరంగంలో ఏర్పరచుకున్న సూత్రాల ప్రకారం బాహ్యంగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటాం. అంతరంగికమైన దానికి అనుగుణంగా, బాహ్యంగా ఉన్నదాన్ని ఎందుకు బలవంతంగా మారుస్తాం? ఒక భావం ప్రకారం ఎందుకు క్రియ జరుపుతాం? భావం క్రియ కన్నా ఎక్కువ శక్తిమంతమైనదా?

భావం ముందు ఏర్పడుతుంది - సహేతుకంగానో, సహజంగా తట్టినందువల్లనో ఆ తరువాత క్రియని అ భావం సమీపానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. దాని ప్రకారం జీవితం నడపటానికి ప్రయత్నిస్తాం. దాన్ని సాధన చేస్తాం. దానికి తగిన క్రమశిక్షణ పొందుతాం. క్రియని భావం సరిహద్దులలోకి తీసుకురావటానికి ఇదొక అనంతమైన కృషి. క్రియని భావం ప్రకారం రూపొందించటానికి ఎందుకీ అంతులేని బాధాకరమైన పోరాటం? లోపలి దానిలా పైదాన్ని చెయ్యాలనే ఈ తపన ఏమిటి? లోపలి దాన్ని శక్తిమంతం చెయ్యటానికా? లేక, లోపలిది సందేహావస్థలో ఉన్నప్పుడు దానికి పైదాని హామీ ఇవ్వటానికా? పైదాని నుంచి సౌఖ్యం పొదుతున్నప్పుడు పై దానికి ఎక్కువ ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఏర్పడవా? బాహ్య వాస్తవికతకి ప్రాధాన్యం ఉంది. కాని, దాన్ని చిత్తశుద్ధికి తార్కాణంగా చూచినప్పుడు, భావానికే ఎక్కువ ఆధిక్యం అని సూచించదా? భావం ఎందుకంత శక్తిమంతమై పోయింది? మనల్ని క్రియాత్మకంగా చేయటానికా? మనం క్రియ జరపటానికి భావం ఎంత వరకు దోహదం చేస్తుంది? క్రియకి అడ్డు తగులుతుందా?

భావం క్రియని, నిశ్చయంగా పరిమితం చేస్తుంది. క్రియ అంటే ఉండే భయమే ఊహని కలిగిస్తుంది. ఊహలో రక్షణ ఉంటుంది. క్రియలో ప్రమాదం ఉంటుంది. క్రియ పరిమితులు లేనట్టిది. అట్టి క్రియని