పుట:Mana-Jeevithalu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియ, భావం

135

గానూ ఉంది. ఆయన అహింసని ఎన్నో సంవత్సరాలుగా సాధన చేశాడుట. దాని శక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం బాగా తెలుసుకున్నాడుట. దాన్ని గురించి ఎన్నో పుస్తకాలు రాశాడుట. తనతో కూడా ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాడు. ఎన్నో ఏళ్లనుంచీ ప్రయత్నపూర్వకంగా దేన్నీ చంపలేదని వివరించాడు. కూరగాయలు తప్ప, వేటినీ తినడుట. తను కూరగాయలు తినే విషయం గురించి ఎన్నో వివరాలు చెప్పాడు. ఆయన జోళ్లూ, చెప్పులూ సహజంగా చచ్చిపోయిన జంతువుల చర్మం నుంచి చేసినవి మాత్రమేనట. ఆయన తన జీవితాన్ని వీలైనంత నిరాడంబరంగా చేసుకున్నాడుట. ఆహార పదార్థాలను గురించి చదివాడుట. తనకు అవసరమైన వాటినే తింటాడుట. ఆయన ఎన్నో సంవత్సరాలుగా కోపం తెచ్చుకోలేదుట. కాని కొన్ని సందర్భాల్లో అసహనం కలుగుతుంది. అది కేవలం నరాల్లో కలిగే ప్రతిక్రియ మాత్రమేనట. ఆయన ప్రసంగం హద్దుల్లో ఉండి సౌమ్యంగా ఉంది. అహింసకున్న శక్తి ప్రపంచాన్ని మారుస్తుందనీ, దాని కోసం తన జీవితాన్ని అంకితం చేశాననీ చెప్పాడాయన. తన గురించి తాను సులభంగా మాట్లాడే రకం కాదాయన. కాని, అహింస విషయంలో ఆయన ధారాళంగా మాట్లాడాడు. మాటలు ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తున్నాయి. తన కిష్టమైన ఆ విషయం గురించి మరింత ప్రగాఢంగా చర్చించటానికే వచ్చానని చెప్పాడు.

దారికెదురుగా ఆ పెద్ద కాలవ ప్రశాంతంగా ఉంది. వాటిల్లో నీళ్లు కల్లోలితమైనాయి పెద్ద గాలి వీచే సరికి. చెట్టుకున్న పెద్ద పెద్ద ఆకుల నీడ నీటిమీద పడుతోంది. ఒకటో రెండో కలువ పువ్వులు నీటిపై భాగం మీద ప్రశాంతంగా తేలుతున్నాయి. ఒక మొగ్గ నీటిపైకి కొద్దిగా కనిపిస్తోంది. పక్షులు రావటం మొదలైంది. ఎన్నో కప్పలు బయటికి వచ్చి మళ్లీ నీళ్లలోకి దూకాయి. అలలు క్రమంగా మాయమైపోయాయి. మళ్లీ నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఒక పొడుగాటి చెట్టుకి బాగాపైన పిట్ట ఒకటి కూర్చుని ముక్కుతో ఈకలు సవరించుకుంటూ పాడుతోంది. ఒక వంపులా ఎగిరి మళ్లీ తన చిటారు కొమ్మమీదికి వస్తోంది. ప్రపంచాన్ని చూసీ, తన్ను తాను చూసుకునీ మురిసిపోతుంది. మాకు కొద్ది దూరంలోనే ఒక లావుపాటి ఆయన పుస్తకం పుచ్చుకుని కూర్చున్నాడు. కాని, ఆయన దృష్టి ఎక్కడో ఉంది. చదవటానికి