పుట:Mana-Jeevithalu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తాపత్రయం వల్ల వస్తుంది. కొనసాగాలనీ, ఇంకా అవాలనీ కోరటం వల్ల వస్తుంది - అంటే స్తబ్ధంగా ఉండిపోతూ తృప్తిపడటం కాదు. "ఇంకా" అనేది 'నేను' నిత్యం చేసే గోల. అది అనుభూతి కోసం అపేక్షించటం - గతించినది గాని, రానున్నది గాని. అనుభూతి మానసికమైనది. అందువల్ల సంఘర్షణని అర్థం చేసుకోవటానికి మనస్సు సాధనం కాదు. అర్థం చేసుకోవటం మాటల్లో కాదు. అది మానసిక ప్రక్రియ కాదు. అందువల్ల అది అనుభవానికి చెందిన విషయం కాదు. అనుభవం ఒక జ్ఞాపకం. మాటలేకుండా, సంకేతం లేకుండా, రూపం లేకుండా జ్ఞాపకం అనేది ఉండదు. సంఘర్షణ గురించి బోలెడు గ్రంథాలు చదవచ్చు. దానికీ, సంఘర్షణని అర్థం చేసుకోవటానికీ సంబంధం లేదు. సంఘర్షణని అర్థం చేసుకోవాలంటే ఆలోచన అడ్డు రాకూడదు. ఆలోచించేవాడు లేకుండా సంఘర్షణని తెలుసుకోవటం జరగాలి. ఆలోచించే వాడు ఎంచుకుంటాడు. సంతోషకరమైన వాటివైపూ, సంతృప్తికరమైన వాటివైపూ తప్పని సరిగా మొగ్గుతాడు. దాంతో, సంఘర్షణని పోషిస్తాడు. ఒక ప్రత్యేక విషయంలో సంఘర్షణని వదిలించుకోవచ్చు. సంఘర్షణ పుట్టించే క్షేత్రం అలాగే ఉంటుంది. ఆలోచించేవాడు సమర్థించటమో, ఖండించటమో చేస్తే అవగాహన కాకుండా అడ్డుపడతాడు. ఆలోచించేవాడు లేకుండా ఉంటే సంఘర్షణ సూటిగా అర్ధమవుతుంది - అనుభవించేవాడు అనుభవం పొందుతున్నట్లుగా కాదు. అనుభవమవుతూన్న స్థితిలో అనుభవించేవాడు గాని, అనుభవం పొందబడేది కాని ఉండదు. అనుభవమవటం సూటిగా అవుతుంది. ఆ సంబంధం సూటిగా ఉంటుంది. జ్ఞాపకం ద్వారా కాదు. ఈ ప్రత్యక్ష సంబంధమే అవగాహన కలుగజేస్తుంది. అవగాహన వల్ల సంఘర్షణ నుంచి విముక్తి కలుగుతుంది. సంఘర్షణ నుంచి విముక్తి కలగటంతో సమైక్యత ఏర్పడుతుంది.


44. క్రియ, భావం

ఆయన మృదువుగానూ, శాంతంగానూ ఉన్నాడు. ఆయన ముఖం మీద వెంటనే వస్తుంది చక్కని చిరునవ్వు. ఎంతో సామాన్యమైన దుస్తులు వేసుకున్నాడు. ఆయన ప్రవర్తన నెమ్మదిగానూ మొహమాటంతో కూడినట్లు