పుట:Mana-Jeevithalu.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
131
ఒకే రీతిగా ఉండటం

ఒకే రీతిగా ఉండటం అంటే ఆలోచనారహితంగా ఉండటమే. ఆలోచన వల్ల బాధ పడటానికి సాహసించటం కన్న, మార్పు లేకుండా ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం, ఒక సిద్ధాంతానికో, సంప్రదాయానికో అనుగుణంగా వర్తించటం ఎక్కువ సులభం, క్షేమదాయకం. అధికారానికి అంతర్గతంగా గాని, బహిరంగంగా గాని తలవంచటానికి ఎదురు ప్రశ్న వేయవలసిన అవసరం ఉండదు. అది ఆలోచననీ, దానితో బాటు వచ్చే ఆదుర్దాలనీ, ఆందోళనలనీ నిర్మూలిస్తుంది. మనం నిశ్చయించుకున్న వాటినీ, అనుభవాలనీ, నిర్ణయాలనీ అనుసరించటం వల్ల మన లోలోపల వైరుధ్యం కలగదు. మన లక్ష్యం కోసమే మనం ఒకే రీతిలో ఉంటాం. ఒక మార్గాన్ని ఎంచుకుని దాన్నే అనుసరిస్తాం - దేనికీ లొంగకుండా కృతనిశ్చయంతో అనుసరిస్తాం. మనలో చాలామంది ఏవిధమైన ఆందోళనా కలిగించని, అధమం, మానసిక రక్షణ కలిగించే జీవనమార్గాన్ని ఆశించరా? తన ఆదర్శానికి అనుగుణంగా జీవించే మనిషిని మనం ఎంత గౌరవిస్తాం! వారిని ఉదాహరణలుగా తీసుకుంటాం. వారిని అనుసరించాలి, ఆరాధించాలి. ఒక ఆదర్శాన్ని అనుసరించటానికి కొంత శ్రమా, పీకులాటా ఉన్నప్పటికీ, మొత్తం మీద అది సంతోషదాయకంగానూ, సంతృప్తికరంగానూ ఉంటుంది. అయితే, ఆదర్శాలు స్వయం నిర్మితాలూ, స్వీయ కల్పితాలే కదా. ఆధ్యాత్మిక విషయాల్లో గాని, ప్రాపంచిక విషయాల్లో గాని మీ ఆదర్శపురుషుణ్ణి ఎంచుకుని అతణ్ణి అనుసరిస్తారు. ఒకే రీతిగా ఉండాలనే కోరిక ఒక విధమైన శక్తినీ, సంతృప్తిని ఇస్తుంది - చిత్తశుద్ధిలో రక్షణ ఉంటుంది కనుక. కాని, చిత్తశుద్ధి నిరాడంబరత కాదు. నిరాడంబరత లేకుండా అవగాహన కలగడం సాధ్యం కాదు. బాగా ఆలోచించి తయారు చేసుకున్న పథకానికి అనుగుణంగా ఒకే రీతిలో నడిచినట్లయితే, ఏదో సాధించాలనే తపనని తృప్తి పరచినట్లవుతుంది. అందులో విజయం సాధిస్తే సౌఖ్యమూ, రక్షణా ఉంటాయి. ఒక ఆదర్శాన్ని పెట్టుకుని దాన్ని నిరంతరం అనుకరించటం వల్ల ప్రతిఘటన అలవడుతుంది. సర్దుకుపోవటం అనేది ఆ అనుకరించే పద్ధతిని అతిక్రమించకపోవటం. ఒకే రీతిగా ఉండటం వల్ల రక్షణా, నమ్మకం ఉంటాయి. అందుకే అంత గతిలేనట్లు దాన్ని పట్టుకుని వదలం.