పుట:Mana-Jeevithalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒంటరితనం

129

అనివార్యమవుతుంది.

తాపత్రయం కాని వేరే రూపం ఏదీ లేదు. తాపత్రయమే ఉంటుంది. తాపత్రయపడేది అంటూ ఏదీ ఉండదు. తాపత్రయం వివిధ ముఖరూపాలను వివిధ సమయాల్లో ధరిస్తుంది. - ఆ వివిధ ఆసక్తుల జ్ఞాపకాలు మరో కొత్తదానితో కలిసినప్పుడు సంఘర్షణ బయలుదేరుతుంది. ఆ విధంగా ఎంచుకునేది ఒకటి పుట్టుకొస్తుంది - తాను తాపత్రయంతో సంబంధం లేని వేరే జీవినన్నట్లు స్థిరపరుచుకుంటుంది. కాని, ఆ జీవికీ, దాని లక్షణానికీ భేదం లేదు. శూన్యతనీ, అసంపూర్ణతనీ, ఒంటరితనాన్నీ నింపటానికి గాని, దాన్నుంచి పారిపోవటానికి గాని ప్రయత్నించే జీవీ, దేన్నుంచి పారిపోతుందో అదీ, వేరువేరు కాదు. ఆ జీవే అది. తన నుంచి తానే పారిపోలేదు. అది చేయగలిగినదల్లా తన్నుతాను అవగాహన చేసుకోవటమే. తనే ఒక ఒంటరితనం, తన శూన్యత. అది వేరు, తను వేరు అనుకున్నంతకాలం భ్రమా, అంతులేని సంఘర్షణా ఉంటాయి. తనే తన ఒంటరితనం అని ప్రత్యక్షంగా అనుభవం పొందినప్పుడే భయం నుంచి విముక్తి కలుగుతుంది. ఒక ఊహకి సంబంధించినప్పుడే భయం ఉంటుంది. ఊహ జ్ఞాపకం నుంచి వచ్చే ఆలోచనకి ప్రతిక్రియ. ఆలోచన అనుభవ ఫలితం. శూన్యత గురించి అది ఆలోచించగలిగినా, దాని గురించి అనుభూతులు కలిగినా, శూన్యతని ప్రత్యక్షంగా తెలుసుకోలేదు. ఆ "ఒంటరితనం" అనే శబ్దం, దాని బాధాకరమైన, భయంకరమైన జ్ఞాపకాలూ దాన్ని సరికొత్తగా అనుభవం పొందనియ్యవు. మాట అనేది జ్ఞాపకం. మాటకి ప్రాముఖ్యం లేనప్పుడు అనుభవించేదానికీ, అనుభవింపబడేదానికీ మధ్య సంబంధం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అప్పుడు ఆ సంబంధం ప్రత్యక్షంగా కలుగుతుంది. మాట ద్వారా, జ్ఞాపకం ద్వారా కాదు. అప్పుడు, అనుభవించేదే అనుభవం. అప్పుడే భయం నుంచి విముక్తి కలుగుతుంది.

ప్రేమా, శూన్యతా ఒక్కచోట ఉండలేవు. ఒంటరితనం అనే భావం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. మీ శూన్యతని "ప్రేమ" అనే మాట వెనుక దాచుకోవచ్చు. మీరు ప్రేమించే వస్తువు అక్కడింక లేనప్పుడు, దాన్నుంచి ప్రతిక్రియ రానప్పుడు, మీరు మీ శూన్యతని తెలుసుకుంటారు. మీరు నిస్పృహ చెందుతారు. మన నుంచీ, మన అసమర్థత నుంచీ మనమే