పుట:Mana-Jeevithalu.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
127
ఒంటరితనం

మందకొడిగా అలసటగా ఉండే శూన్యత తప్ప. తమ ఇద్దరి గురించీ ఎన్నో ఆలోచించి ఉంచిందిట. ఇప్పుడు అంతా పోగొట్టుకుంది.

సముద్రం మీంచి గాలి చల్లగా హాయిగా వీస్తోంది. చెట్టు క్రింద ప్రశాంతంగా ఉంది. పర్వతాల మీద రంగులు స్పష్టంగా ఉన్నాయి. నీలిరంగు పాల పిట్టలు తెగకూస్తున్నాయి. ఆవూ, దూడా కలిసి తిరుగుతున్నాయి. ఉడత ఒకటి చర్రుమని చెట్టుమీదికి పాకింది - కిచకిచ మంటూ. ఒక కొమ్మమీద కూర్చుని అరవటం మొదలుపెట్టింది. ఆ అరవటం చాలాసేపు సాగించింది తోక పైకీ క్రిందికీ ఆడిస్తూ. దాని కళ్లు తెగమెరుస్తున్నాయి. కాలిగోళ్ళు వాడిగా ఉన్నాయి. ఒక బల్లి వెచ్చదనం కోసం బయటికి వచ్చి ఓ ఈగని పట్టుకుంది. చెట్లపైనున్న కొమ్మలు నాజూగ్గా ఊగుతున్నాయి. ఎండిపోయిన చెట్టొకటి నిటారుగా ఉండి, వెనుక ఆకాశం కనిపిస్తూ అద్భుతంగా ఉంది. సూర్యుడి ఎండకి అది తెల్లబడిపోతోంది. దాని ప్రక్కన మరో ఎండిన చెట్టుంది - నల్లగా, వంకరగా. ఈ మధ్యనే చచ్చిపోయినట్లుంది. దూరాన పర్వతాల మీద మేఘాలు కొన్ని నిలిచిపోయాయి.

ఒంటరితనం ఎంత విచిత్రమైనది, ఎంత భయంకరమైనది! దానికి మరీ దగ్గరగా వెళ్ళడానికి ఎప్పుడూ ఒప్పుకోము. ఒకవేళ ప్రమాదవశాత్తూ వెళ్ళినా తొందరగా పారిపోయి వచ్చేస్తాం. ఒంటరితనం నుంచి పారిపోవడానికీ, దాన్ని కప్పిపుచ్చడానికీ ఏమైనా చేస్తాం. వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ మనం చేసేది దాన్ని తప్పించుకోవడమో, లేదా దాన్ని నెగ్గుకురావడమోననిపిస్తుంది. ఒంటరితనాన్ని తప్పించుకోవడం, జయించడం - రెండూ వృథాయే. అణచిపెట్టి ఉన్నా, నిర్లక్ష్యం చేయబడినా ఆ బాధ, ఆ సమస్య అలాగే ఉంటుంది. జన సమూహంలో పడి మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు. అయినా చెప్పలేనంత ఒంటరిగా ఉంటారు. తీవ్రంగా పనిచేస్తూ ఉండవచ్చు. కాని ఒంటరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది. పుస్తకం మూసెయ్యండి. అది అక్కడే ఉంటుంది. వినోదాలూ, తాగుళ్ళూ అయిపోయిన తరవాత ఒంటరితనపు భయం తిరిగి వస్తుంది. మీరెంతో ఆకాంక్షతో పైకి రావచ్చు. ఇతరులపైన మీకెంతో అధికారం ఉండొచ్చు. జ్ఞాన సంపద మెండుగా ఉండొచ్చు. ఆరాధనలో, వ్యర్ధ పూజా పునస్కారాల్లో మిమ్మిల్ని మీరు