పుట:Mana-Jeevithalu.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
126
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అసూయ, గర్వం మాదిరే మానసికమైనది. కాని అది ప్రేమ కాదు. ప్రేమకీ, మానసిక ప్రక్రియలకీ మధ్య వంతెన కట్టి వాటిని కలపటం సాధ్యం కాదు. అనుభూతులు ఆధిక్యం పొందినప్పుడు ప్రేమకి స్థానం ఉండదు. మానసికమైనవి హృదయంలో నిండుతాయి. ఆ విధంగా ప్రేమ అపరిచితమైనదీ, ప్రయత్నించవలసినదీ, ఆరాధించవలసినదీ అవుతుంది. దాన్ని వినియోగించటానికీ, విశ్వసించటానికీ దాన్ని ఆదర్శంగా చేస్తారు. ఆదర్శాలన్నీ స్వయంకల్పితమైనవే. అందుచేత మనస్సు దాన్ని పూర్తిగా ఆక్రమించటంతో, ప్రేమ ఒక శబ్దం, ఒక అనుభూతి అవుతుంది. అప్పుడిక ప్రేమని పోలుస్తారు. "నేను ఎక్కువ ప్రేమిస్తాను. మీరు తక్కువ ప్రేమిస్తారు" అని. కాని ప్రేమ వ్యక్తిగతం కాదు. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఆలోచనా రూపం లేనట్టి, అనుభూతి అనేది ఎంత మాత్రమూ లేనటువంటి స్థితే ప్రేమ.


42. ఒంటరితనం

ఆవిడ కొడుకు ఈ మధ్యనే పోయాడుట. ఇప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు అందావిడ. బోలెడు తీరుబడి. ఏమీ తోచదు. అలసట, దుఃఖం. చచ్చిపోతే బాగుండుననుకుంటోంది. కుర్రవాడిని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా తెలివిగా పెంచిందిట. అన్నిటికన్నా మంచి స్కూల్లోనూ, కాలేజిలోనూ చదివించిందిట. కుర్రవాణ్ణి పాడుచెయ్యలేదుట - అవసరమైన ప్రతిదీ ఆతడికిచ్చినప్పటికీ. తన నమ్మకం, ఆశ, అన్నీ అతడిలోనే ఉంచిందిట. తన ప్రేమంతా అతనికే ఇచ్చిందిట - ఇంకొకరెవరూ దాన్ని పంచుకోవటానికి లేరు కనుక. ఆవిడా, ఆవిడ భర్తా చాలాకాలం క్రిందటే విడిపోయారుట. ఆవిడ కొడుకు చనిపోవటం - అతని జబ్బుని తిన్నగా కనిపెట్టకపోవటం వల్లా, ఆపరేషను సరిగ్గా చెయ్యకపోవడంవల్లా అని చెప్పింది. "డాక్టర్లు ఆపరేషను విజయవంతమైందనే అన్నారు" అంది చిరునవ్వుతో. ఇప్పుడు ఆవిడ ఒంటరిగా మిగిలింది. జీవితం వ్యర్ధంగా అర్థశూన్యంగా కనిపిస్తోందిట. అతడు పోయినప్పుడు ఎంతో ఏడ్చిందిట. ఇప్పుడిక కన్నీళ్లు మిగలలేదుట -