పుట:Mana-Jeevithalu.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
125
ఎరుక

అనేక రకాలతో సమ్మిళితమైనది కాబట్టి. దాని మొత్తం ప్రక్రియని అర్థం చేసుకోవాలి. సమస్యని ఒక స్థాయిలోనే - భౌతికంగా గాని, మానసికంగా గాని పరిష్కరించడానికి ప్రయత్నించటం మరింత సంఘర్షణకీ సందిగ్ధతకీ దారితీస్తుంది. సమస్య పరిష్కారం అవాలంటే ఇదంతా తెలుసుకుంటూ ఉండటం జరగాలి. దాని మొత్తం ప్రక్రియని తేటతెల్లం చేసే ఉదాసీన పూర్వకమైన ధ్యానం ఉండాలి.

ప్రేమ ఇంద్రియ సంబంధమైన అనుభూతి కాదు. అటువంటి అనుభూతులు మాటల ద్వారా, సంకేతాల ద్వారా ఆలోచనకు రూపానిస్తాయి. అనుభూతులూ, ఆలోచనా ప్రేమ స్థానంలో చోటు చేసుకుంటాయి. ప్రేమకి ప్రత్యామ్నాయం అవుతాయి. అనుభూతులు లైంగిక వాంఛల లాగే మానసికమైనవి. మనస్సు ఆకలినీ, భావోద్రికతనీ జ్ఞాపకం చేసుకోవటం ద్వారా పెంపొందిస్తుంది. ఆ విధంగా సంతృప్తి కలిగించే అనుభూతులు పొందుతుంది. మనస్సు వివిధ పరస్పర విరుద్ధమైన ఆసక్తులతో, కోరికలతో, వాటి వాటి ప్రత్యేక అనుభూతులతో కూడుకొన్నది. అందులో ఒకటి తక్కిన వాటిపైన ఆధిపత్యం వహించటం మొదలుపెడితే ఘర్షణపడి సమస్యని సృష్టిస్తాయి. అనుభూతులు సంతోషకరమైనవీ, సంతోషకరం కానివీ, రెండు రకాలైనవీ ఉంటాయి. మనస్సు సంతోషకరమైన వాటినే పట్టుకుని ఉంటుంది. వాటికి బానిస అవుతూ. మనస్సులో పరస్పర విరుద్ధమైన అనుభూతులు కూడబెట్టి ఉన్నప్పుడు ఈ బంధనం సమస్య అయిపోతుంది. బాధాకరమైన వాటిని తప్పించుకోవటం కూడా బంధమే. దాని భ్రమలూ, దాని సమస్యలూ దానివి. మనస్సే సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి వాటిని అది పరిష్కరించలేదు. ప్రేమ మనస్సుకి చెందినది కాదు. కాని అది మనస్సులోకి వచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. అప్పుడు దాన్ని ప్రేమ అని పిలుస్తుంది. ఈ విధమైన మానసిక ప్రేమని గురించి ఆలోచించవచ్చు. దానికి ముస్తాబు చేసి ప్రత్యేకించవచ్చు. మనస్సు సంతోషకరమైన అనుభూతులను గుర్తుకి తెచ్చుకోగలదు. ముందుగానే ఊహించగలదు. ఈ ప్రక్రియే ఆకలి - దాన్ని ఏ స్థాయిలో ఉంచినా సరే. మనోరంగంలో ప్రేమ ఉండలేదు. మనస్సు అనేది భయం, విచక్షణ చేయటం, ఈర్ష్య, ఆధిపత్యం, పోల్చటం, వదులుకోవటం - ఇవన్నీ ఉండే స్థలం. అందుచేత అందులో ప్రేమ ఉండదు.