పుట:Mana-Jeevithalu.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
118
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

సాక్షాత్కారంలోనే వివేకం ఉంది. వివేకం ఎప్పుడూ క్రొత్తగా స్వచ్ఛంగా ఉంటుంది. దాన్ని పోగుచేసే సాధనం లేదు. సాధనం స్వచ్ఛతనీ, క్రొత్తదనాన్నీ, అప్రయత్న సాక్షాత్కారాన్ని ధ్వంసం చేస్తుంది.

సత్యానికి అనేక మార్గాలుంటాయనేది మనస్సు అసహనంతో కనిపెట్టిన విషయం. అవి మనస్సు అలవరచుకున్న సహనం ఫలితంగా వచ్చినవి. " నేను నా మార్గాన్ని అనుసరిస్తాను, మీరు మీ దాన్ని అనుసరించండి. కాని మనం స్నేహితులుగా ఉందాం. ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుందాం" అంటారు. మీరు ఉత్తరానికీ, నేను దక్షిణానికీ వెడుతూంటే మనం కలుసుకుంటామా? మీకు కొన్ని నమ్మకాలుండి, నాకు వేరే కొన్ని ఉంటే మనం స్నేహంగా ఉండగలమా? నేను సామూహిక హంతకుణ్ణి, మీరు శాంతి యుతమైనవారూ అయితే? స్నేహంగా ఉండటం అంటే పనిలోనూ, ఆలోచనలోనూ సంబంధం ఉండటం. అయితే, ద్వేషించే మనిషికి, ప్రేమించే మనిషికీ మధ్యా, భ్రమలో ఉన్న మనిషికీ, స్వేచ్ఛగా ఉన్నవానికీ మధ్యా ఏదైనా సంబంధం ఉంటుందా? స్వేచ్ఛగా ఉన్న మనిషి బంధనంలో ఉన్నవానితో ఏదో విధమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు; కాని భ్రమలో ఉన్న మనిషి స్వేచ్ఛగా ఉన్న మనిషితో సంబంధం పెట్టుకోనేలేడు.

విడిగా ఉన్నవాళ్లు వారి వారి ప్రత్యేకతల్ని పట్టుకుని వదలక తమలాగే స్వార్థపరులైన మరికొందరితో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. కాని అటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సంఘర్షణకీ బాధకీ దారితీస్తాయి. ఈ బాధని తప్పించుకోవటానికి గడుసుతనం ఉన్నవాళ్లు సహనాన్ని కనిపెడతారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ కట్టుకున్న అడ్డుగోడ మీంచి చూస్తూ దయ, ఔదార్యం చూపించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సహనం మానసికమైనది - హృదయానికి సంబంధించినది కాదు. ప్రేమిస్తున్నప్పుడు సహనం గురించి మాట్లాడతారా? హృదయం ఖాళీగా ఉన్నప్పుడు మనస్సు దాన్ని కపట సాధానాలతో, భయాలతో నింపుతుంది. సహనం ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఉండదు.

సత్యానికి మార్గం లేదు. సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. ఆ సాక్షాత్కారానికొక సూత్రం లేదు. సూత్రీకరించినది సత్యం కాదు. అపరిచిత