పుట:Mana-Jeevithalu.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
116
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అంటే, తెలిసిన దాన్నీ, నిశ్చయమైన దాన్నీ, రక్షణనీ పట్టుకు వ్రేలాడే మనస్సు తెచ్చినదే. ఈ ఎడానికి వంతెన వేయలేము. దాన్ని దాటించేందుకు ఏ విధమైన పూజాలేదు, క్రమశిక్షణ లేదు, త్యాగం లేదు. నిజమైన దాని వద్దకు మిమ్మల్ని తీసుకుపోవటం కాని, ఆ అంతరాన్ని లేకుండా చేయటం గాని ఏ రక్షకుడికీ, ఏ దివ్యజ్ఞాన సంపన్నుడికీ, ఏ గురువుకీ సాధ్యం కాదు. విభజన ఏర్పడినది నిజానికీ, మీకూ మధ్య కాదు. మీలో మీకే - పరస్పర విరుద్ధమైన కోరికల మధ్య. కోరిక దానికి వ్యతిరేకమైన దాన్ని సృష్టిస్తుంది. పరివర్తన అంటే ఒకే కోరికపైన కేంద్రీకృతం కావటం కాదు - తాపత్రయం తెచ్చే సంఘర్షణ నుంచి విముక్తి పొందటమే. మనిషిలో ఏ స్థాయిలో తాపత్రయం ఉన్నప్పటికీ అది సంఘర్షణని పెంపొదించుతుంది. దాన్నుంచి తప్పించుకోవటానికి వీలైన ప్రతి మార్గాన్నీ ప్రయత్నిస్తాం. దానివల్ల లోపలా బయటా కూడా సంఘర్షణ ఎక్కువవుతుంది, అంతే. ఈ సంఘర్షణని రూపు మాపడం ఇంకొకరి వల్ల జరిగేది కాదు - వారెంత గొప్పవారైనా. మాయవల్లనో, పూజవల్లనో జరిగేది కూడా కాదు. ఇవి మిమ్మల్ని హాయిగా నిద్రపుచ్చవచ్చు. కాని, మేలుకోగానే ఆ సమస్య ఇంకా అక్కడే ఉంటుంది. కాని, మనలో చాలా మంది మేలుకోవాలని కోరుకోరు. అందువల్ల మనం భ్రమలోనే బ్రతుకుతాం, సంఘర్షణ రూపుమాసి పోయినప్పుడు ప్రశాంతత ఉంటుంది. అటువంటప్పుడే వాస్తవమైనది ఉద్భవిస్తుంది. దివ్యప్రభువులూ, రక్షకులూ, గురువులూ ముఖ్యం కాదు. అవసరమైనదేమిటంటే, కోరికల వలన పెరిగే సంఘర్షణని అవగాహన చేసుకోవటం. ఈ అవగాహన ఆత్మజ్ఞానం వల్లా, మనసు యొక్క సంచలనాలను నిత్యం తెలుసుకుంటూ ఉండటం వల్లా కలుగుతుంది.

తన్ను తాను తెలుసుకుంటూ ఉండటం ప్రయాసకరం. మనలో చాలామంది సులభమైన ఊహామార్గాన్ని ఇష్టపడతారు కాబట్టి మన జీవితానికొక ఆకారాన్నీ, పద్ధతినీ సమకూర్చే అధికారిని ప్రవేశపెడతారు. ఈ అధికారి ప్రభుత్వంలా సామూహికమైనది కావచ్చు, దివ్య ప్రభువు, రక్షకుడు, గురువు వంటి వ్యక్తి కావచ్చు. అధికారం ఎటువంటిదైనా అంధకార బంధురమే. ఆలోచనారాహిత్యాన్ని పెంచుతుంది. మనలో చాలా మంది ఆలోచిస్తే బాధ కలుగుతుంది అనుకుంటారు కాబట్టి అధికారికి తమ్ము తాము