పుట:Mana-Jeevithalu.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
114
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆధారపడి ఉండదు. నిరసన గాని, సమర్ధన గాని, ఏ రకమైన ఐక్యభావం గాని లేకుండా తెలుసుకున్నప్పుడే సత్యం అవగాహన అవుతుంది. అనుభవం సత్యానికి మార్గం కాదు. "మీ అనుభవం" అనీ "నా అనుభవం" అనీ లేదు - సమస్యని వివేకంతో అవగాహన చేసుకోవటం మాత్రమే.

ఆత్మజ్ఞానం లేనట్లయితే, అనుభవం, భ్రమని పెంపొందిస్తుంది. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఏ సమస్యకైనా ప్రతిక్రియగా ఏర్పడే అనుభవాన్ని పదిలపరుచుకోవటం జరగదు. దాని జ్ఞాపకం మిగలదు. ఆత్మజ్ఞానం అంటే అనుక్షణమూ తన మనసు అవలంబించే మార్గాలనీ, దాని ఉద్దేశాలనీ, ప్రయత్నాలనీ, ఆలోచనలనీ, తృష్ణలనీ కనుక్కోవటమే. "మీ అనుభవం" అనీ, "నా అనుభవం" అనీ ఎన్నటికీ ఉండజాలదు. "నా అనుభవం" అనటంలోనే అజ్ఞానంలో, భ్రమలో ఉన్నట్లు తెలుస్తుంది. కాని, మనలో చాలామంది భ్రమలోనే జీవించటానికి ఇష్టపడతారు - అందులోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది కనుక. మనకి ఉత్తేజాన్ని కలిగించి, మనకొక ఔన్నత్య భావాన్ని కలుగజేసే అంతరంగిక ఆశ్రయం అది. నాకే కనుక సామర్థ్యం, సహజమైన చాకచక్యం, గడుసుతనం ఉన్నట్లయితే, నేను ఆ భ్రమకి నాయకుడిగా గాని మధ్యవర్తిగా గాని, ప్రతినిధిగా గాని అవుతాను. చాలా మందికి ఉన్నదాన్ని తప్పించుకోవటమే ఇష్టం. ఒక సంస్థ ఆస్తులతో, ఆచారాలతో, ప్రమాణాలతో, రహస్య సమావేశాలతో స్థాపితమవుతుంది. భ్రమకి సంప్రదాయం ప్రకారం దుస్తులు వేసి, గౌరవస్థానంలో ఉంచి, ఒక అధికార పరంపర విధానాన్ని ఏర్పరుస్తారు - మనలో అందరూ ఏదో ఒక విధమైన అధికారాన్ని ఆశిస్తూ ఉంటారు కనుక. కొత్తగా చేరినవాడు, ప్రారంభదశలో ఉన్నవాడు, శిష్యుడు, గురువు - అని ఏర్పాటు చేస్తారు. గురువుల్లో కూడా అనేక రకాలైన వారున్నారు - వారి వారి ఆధ్యాత్మిక వికాసాన్ని బట్టి. మనలో అనేక మంది ఇతరులను తమ స్వలాభానికి వుపయోగించుకోవాలన్నా, ఇతరుల లాభానికి తాము ఉపయోగపడాలన్నా ఇష్టపడతారు. ఈ వ్యవస్థ అలాంటి సదుపాయాలను కలగజేస్తుంది - నిగూఢంగానో, ప్రకాశంగానో.

ఇతరులను స్వలాభానికి ఉపయోగించుకోవడమంటే ఇతరుల స్వలాభానికి ఉపయోగింపబడటమే. ఇతరులను మీ మానసికావసరాలకు వినియోగించుకోవాలని కోరటంపైన ఆధారపడేటట్లు చేస్తుంది. ఆధార