పుట:Mana-Jeevithalu.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
112
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

బొత్తిగా తెలుసుకోకుండా ఉండి ఉండొచ్చు. లేదా, తెలుసుకోవాలన్న కోరిక లేకపోవచ్చు. కాని, అది అలాగే ఉంటుంది - దాన్ని తప్పించుకోవటానికి మీ ఇష్టం వచ్చినట్లు ఏంచేసినా సరే. పక్కతోవల్నుంచి దాన్ని తప్పించుకోవచ్చు. వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని హింస, ఆరాధన, జ్ఞానం, వినోదం - ఏవిధంగానైనా, మీరు నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ ఏమీ కాకపోవటమనే దానితోనూ, దానివల్ల కలిగే భయంతోనూ మీకు సంబంధం ఏర్పడటమన్నది మీరు దాన్ని తప్పించుకునే మార్గాలన్నిటినీ మీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీకు దానితో ఒక ప్రత్యేక వ్యక్తిగా సంబంధం లేదు. గమనించేవాడుగా వాటిని గమనించడం లేదు. ఆలోచించేవాడుగా గమనించేవాడుగా మీరు లేనప్పుడు అదీ ఉండదు. మీరూ, ఏమీ కాకపోవటమనేదీ ఒక్కటే. మీరూ, ఏమీకాక పోవటమనేదీ ఒక సమైక్యస్థితి - రెండూ వేరు వేరు ప్రక్రియలు కావు. మీరు ఆలోచించేవాడిగా దాన్ని గురించి భయపడితే, అది మీకు వ్యతిరేకమయినదనీ, విరుద్ధమైనదనీ అనుకుని దాన్ని సమీపించబోతే, దానిపట్ల మీరుఏ చర్య తీసుకున్నా అది భ్రమకి దారి తీస్తుంది. ఆ ఏమీ కాకపోవటమనేది మీరేనని కనుక్కుంటున్నప్పుడు, అనుభవం పొందుతున్నప్పుడు భయం పూర్తిగా అడుగంటుతుంది. ఎందువల్లనంటే ఆ భయం అనేది - ఆలోచించేవాడు తను వేరు, తన ఆలోచనలు వేరు అనుకొని, వాటితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొంటున్నప్పుడే ఉంటుంది కనుక. ఆ భయం పూర్తిగా అంతమై పోయినప్పుడే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇటువంటి ప్రశాంతతలో సత్యం ఆవిర్భవిస్తుంది.


40. "నా మార్గం, మీ మార్గం"

ఆయన పండితుడు. ఆయనకి ఎన్నో భాషలు మాట్లాడటం వచ్చు. మరొకరు మద్యానికి అలవాటుపడ్డట్లుగా ఆయన జ్ఞానానికి అలవాటుపడ్డాడు. తన అభిప్రాయాలకు ఆధారాలుగా ఎవరెవరో చెప్పిన వాటిని ఎప్పుడూ ఉదాహరిస్తూ ఉంటాడు. ఆయనకి విజ్ఞాన, సాంఘిక, శాస్త్రాల్లో కొంత ప్రవేశం