పుట:Mana-Jeevithalu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పిల్లల గురించి మాట్లాడినప్పుడు వాళ్లు తనకి ఆనందం కలిగించే బొమ్మలు అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన ఒంటరిగా ఉండలేనన్నాడు. ఎవరో ఆయనకి హాని కలిగించారు. తిరిగి కక్ష తీర్చుకోవాలంటే అ వ్యక్తి అందుబాటులో లేడు. అందుచేత తనకు అందుబాటులో ఉన్న వారిమీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. తను ఎందుకంత క్రూరంగా ఉంటాడో, తను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్లకే ఎందుకు హాని కలిగించాలని కోరుతున్నాడో తనే అర్థం చేసుకోలేకపోతున్నానన్నాడు. కొంతసేపు మాట్లాడక క్రమంగా కరిగి, దాదాపు స్నేహపూర్వకంగా అయాడు. అది క్షణం సేపు వెచ్చదనం చేకూర్చి, దాన్నుంచి ఏ మాత్రం ఆశించినా లేదా ఏమాత్రం అడ్డుతగిలినా అంతలోనే మూసుకు పోయే స్నేహశీలత అది. ఆయన్నుంచి ఏమీ అపేక్షించటం జరగలేదు కనుక ఆయన స్వేచ్ఛగా ఉన్నాడు. తాత్కాలికంగా ప్రేమపూర్వకంగా ఉన్నాడు.

ఇంకొకరికి హాని కలిగించాలనీ, గాయం కలిగించాలనీ - మాట ద్వారా గాని, చేష్ట ద్వారా గాని, మరీ గాఢంగా గాని - మనలో చాలమందిలో బలమైన కోరిక ఉంటుంది. అది సర్వసాధారణమైనది. అది కలిగించే ఆనందం భయంకరం. మనం గాయపడకూడదనే కోరికే ఇంకొకరిని గాయపరచేలా చేస్తుంది. ఇతరులకు హాని కలిగించటం ఒక విధమైన ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అనేక రూపాలు ధరిస్తుంది - పరిస్థితులను బట్టీ, ప్రవృత్తులను బట్టీ. ఇంకొకరిని గాయపరచటం ఎంత సులభం! గాయపరచకుండా ఉండడానికి ఎంత మృదుత్వం అవసరమవుతుంది! మనం గాయపడ్డాం కాబట్టి ఇతరుల్ని గాయపరుస్తాం. మన సంఘర్షణలవల్ల, దుఃఖాలవల్ల మనం ఎన్నో దెబ్బలు తిని ఉంటాం. అంతర్గతంగా ఎంత చిత్రహింస అనుభవిస్తే బయటికి అంత హింసాత్మకంగా ఉండాలనే తపన ఉంటుంది. అంతరంగిక కల్లోలం బాహ్య రక్షణ కోసం అర్రులు చాచేటట్లు చేస్తుంది. తన్ను తాను రక్షించుకుంటున్న కొద్దీ ఇతరులపైన దాడి ఎక్కువవుతూ ఉంటుంది.

మనం అంత జాగ్రత్తగా దాచుకుని రక్షించుకునేదేమిటి? నిశ్చయంగా అది మన గురించి మనకున్న భావమే - ఏస్థాయిలో నైనా మనం అ భావాన్ని, ఆ కూడబెట్టిన వాటి కేంద్రాన్ని రక్షించకుండా ఉన్నట్లయితే, "నేను" అనేది "నా"