పుట:Mana-Jeevithalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కాదు. ఏ విధంగా సంతృప్తి లభిస్తుందో, అందుకు తగిన సాధనాన్నే ఎంచుకోవటం జరుగుతుంది. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటానికొక ఉద్దేశం అవసరం ఉండదు. ఉద్దేశం, సాధనం అవగాహన కాకుండా అడ్డుపడతాయి. అన్వేషణ అంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకోవటం - ఏదో ఫలానా దాని కోసం అని కాదు. ఒక లక్ష్యం కోసం దాని సాధన కోసం పడే తాపత్రయం గురించి తెలుసుకోవటమే అన్వేషణ. ఇలా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకున్నందువల్ల 'ఉన్నది' అవగాహన అవుతుంది.

శాశ్వతత్వం కోసం, కొనసాగింపు కోసం మనం తాపత్రయ పడటం చిత్రంగా ఉంటుంది. ఈ కోరిక ఎన్నో రూపాల్లో ఉంటుంది. మోటుగా ఉండేది మొదలుకొని అత్యంత సూక్ష్మరూపం వరకూ స్పష్టమైన రూపాలు మనకి పరిచితమైనవే; పేరు, ఆకారం, లక్షణం మొదలైనవి. పైకి కనిపించని తాపత్రయాన్ని కనిపెట్టటం, అర్థం చేసుకోవటం అంతకన్న చాలా కష్టం. ఒక ఊహ గాని, ఉండటం గాని, జ్ఞానం గాని, అవటం గాని - ఏ స్థాయిలో ఉన్నా ఆ ప్రత్యేక రూపాన్ని తెలుసుకోవటం, వెలికి తీసుకురావటం కష్టం. కొనసాగుతూ ఉండడం గురించి మాత్రమే మనకు తెలుసును. కొనసాగుతూ ఉండని స్థితి ఎటువంటిదో మనకి తెలియదు. దాన్ని మనం మరణం అనీ, ఎవరికీ తెలియనిది అనీ, మాయ అనీ అనేక రకాలుగా పిలుస్తాం. దానికి ఆ విధంగా పేర్లు పెట్టి, దాన్ని ఏదో విధంగా పట్టుకోవాలని చూస్తాం - మళ్లీ అది కొనసాగుతూ ఉండాలనే కోరికే.

ఆత్మచైతన్యం అంటే - అనుభవం, అనుభవానికి నామకరణం చేయటం, దాన్ని పదిలపరచుకోవటం. ఈ ప్రక్రియ మనస్సులో వివిధ అంతస్తుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మచైతన్య ప్రక్రియని పట్టుకు వ్రేలాడతాం - దానివల్ల కలిగే ఆనందం క్షణికమే అయినప్పటికీ, సంఘర్షణ, గందరగోళం, దుఃఖం అనంతమైనప్పటికీ. మనకి తెలిసినది అంతే. అదే మన బ్రతుకు - మన జీవం, భావం, స్మృతి, శబ్దం - అన్నీ కొనసాగుతూ ఉండటమే. భావం కొనసాగుతుంది - మొత్తంగానో, దానిలో ఒక భాగంగానో, "నేను"గా రూపొందిన భావం అది. కాని, ఈ కొనసాగింపువల్ల స్వేచ్ఛ ప్రాప్తిస్తుందా? స్వేచ్ఛలోనే కదా ఆవిష్కారం, పునఃసృష్టీ ఉన్నవి.