పుట:Mana-Jeevithalu.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
104
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తాను ఎప్పుడూ వదులుకోదు. తన్ను తాను ముక్కలుగా చేసుకోదు. అందుకని ఒక ఆదర్శంగాని, ఊహగాని ఆత్మని సంపన్నయుతంగా చేస్తుంది. దీన్ని ప్రేమ అని కూడా అనుకుంటారు. నా కొడుకునీ, నా భర్తనీ ప్రేమిస్తున్నాను. వాళ్ళు ఇది అవాలి, అది అవాలి అని కోరుతున్నాను. ఇప్పుడున్నట్లుగా కాక, వేరే ఏదో అవాలని కోరుతున్నాను.

ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలంటే ఊహనీ, ఆదర్శాన్నీ అవతలికి తోసెయ్యాలి. ఉన్నదాన్ని అర్ధం చేసుకోవటం తక్షణం అవసరం కాదనిపించినప్పుడే ఊహని అవతలికి తోసెయ్యటం కష్టమవుతుంది. స్వయం కల్పితమైన ఊహ ఉన్నదాని కన్న ఎక్కువ సంతృప్తికరమైనది కాబట్టి ఉన్నదానికీ ఊహకీ మధ్య మనలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఉన్నదాన్ని, అంటే వాస్తవమైనదాన్ని ఎదుర్కోవలసి, వచ్చినప్పుడే ఆ ఆదర్శం ముక్కలవుతుంది. అందుచేత ఊహని ఎలా వదిలించుకోవాలన్నది కాదు - వాస్తవమైన దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది అసలు విషయం. సంతృప్తిని కలిగించే ప్రక్రియని, స్వీయ ప్రకృతిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాస్తవమైన దాన్ని ఎదుర్కోవటం సాధ్యం.

మనమంతా సాఫల్యాన్ని అపేక్షించే వాళ్లమే - ఏ రకంగా అపేక్షించి నప్పటికీ, ధనం, హోదా, పిల్లలు, భర్త, దేశం, ఆదర్శం, సేవ, త్యాగం, అధికారం చెలాయించటం, అణచి ఉంచటం - ఈ విధంగా. కాని స్వీయ సాఫల్యం పొందటం అంటూ ఉందా? సాఫల్యం పొంద కోరినది ఎప్పుడూ స్వయంకల్పితమే కదా - తాను ఎంచుకున్నదే కదా. అందుచేత సాఫల్యం పొందాలనే తపన ఆత్మని శాశ్వతం చేసుకునే విధానమే. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని సాఫల్యం పొందే విధానం తాను స్వయంగా ఎంచుకున్నదే. అది సంతృప్తి చెందాలనే కోరికపైన, ఆ సంతృప్తి శాశ్వతంగా ఉండాలనే కోరికపైన ఆధారపడి ఉంటుంది. అందుచేత కోరికను శాశ్వతం చేసుకునే మార్గాన్ని ప్రయత్నించటమే స్వలాభాన్వేషణ. కోరిక అశాశ్వతమైనది. దానికి ఒక స్థిరనివాసం లేదు. అది కావాలని పాకులాడుతున్న దాన్ని కొంతకాలంపాటు కొనసాగనివ్వవచ్చు. కాని, కోరిక అనేదానికే శాశ్వతత్వం లేదు. దీన్ని మనం అనాలోచితంగా గ్రహిస్తాం. అందువల్లనే ఊహనీ, నమ్మకాన్నీ