పుట:Mana-Jeevithalu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
100
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

సరిపెట్టుకుంటూ స్వతంత్రంగా ఉంటున్నాడు. మెత్తని వాడైనా పట్టుదల గల మనిషి. ఎంతో దూరం నుంచి వచ్చానన్నాడు. ధ్యానం విషయమై తెలుసుకోవటానికి - ముఖ్యంగా, కొన్ని మంత్రాలూ, పదాలూ నిత్యం పదే పదే జపించటం ద్వారా ఎంతో సులువుగా మనస్సుని శాంతింప జేయటం విషయమై. అంతేకాదు అసలు మాటల్లోనే కొంత మాయ ఉందిట. శబ్దాల్ని సరియైన పద్ధతిలో ఉచ్చరించాలిట. సరిగ్గా వల్లించాలిట. ఈ శబ్దాలు ప్రాచీన కాలం నుంచీ సంక్రమించినవట. అ శబ్దాల్లోని అందం, వాటి గమకం, లయ ఇవే ధ్యానం కేంద్రీకరించటానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయిట. ఆ విధంగా చెప్పి, మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఆయన గొంతు బాగుంది. ఆ శబ్దాల్ని అర్థం చేసుకున్నందువల్లనూ వాటిపైన ఉన్న అభిమానం వల్లనూ ఆ గొంతులో ఒకవిధమైన తీయదనం వచ్చింది. ఎంతోకాలం నుంచి శ్రద్ధగా సాధన చేయటం వల్ల సునాయాసంగా వల్లిస్తున్నాడు. ఆయన వల్లించటం మొదలు పెట్టటంతో సర్వాన్నీ విస్మరించాడు.

పొలంలోంచి పిల్లన గ్రోవి శబ్దం వినవస్తోంది. మధ్య మధ్య ఆపుతూ వాయిస్తున్నా, స్వరం స్పష్టంగానూ పరిశుద్ధంగానూ ఉంది. అతడు పెద్ద చెట్టు క్రింద చిక్కని నీడలో కూర్చుని వాయిస్తున్నాడు. అతనికి అవతల దూరాన కొండలు ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ కొండలు, ఆ మంత్ర పఠనం, పిల్లన గ్రోవి శబ్దం - అన్నీ కలిసి, మాయమై మళ్లీ మొదలవుతున్నాయి. చిలకలు చప్పుడు చేస్తూ ఎగిరి వెళ్లాయి. మళ్లీ పిల్లనగ్రోవి మీద స్వరాలూ, గంభీరంగా, శక్తిమంతంగా చదువుతూన్న మంత్రం. అది ప్రాతఃకాలం. సూర్యుడు చెట్లమీదుగా పైకి వస్తున్నాడు. జనం గ్రామాలనుంచి పట్నానికి పోతున్నారు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ. పిల్లనగ్రోవీ, మంత్రమూ - రెండూ ఆగకుండా వినిపిస్తూనే ఉన్నాయి. దారిన పోయేవాళ్లు కొంతమంది ఆగిపోయారు వినటానికి. ఆ దారి ప్రక్కనే కూర్చుండిపోయారు ఆ మంత్రాలకీ, ఉదయకాలం మహిమకీ ముగ్ధులై. దూరం నుంచి వినిపిస్తున్న రైలుకూత వేటికీ అడ్డు రాలేదు. అన్ని శబ్దాలూ కలిసిపోయి భూతలాన్ని నింపినట్లుగా తోచింది. కాకి గట్టిగా అరవటం కూడా కటువుగా ధ్వనించలేదు.

ఎంతో చిత్రంగా శబ్దాల ధ్వనిలో చిక్కుకుంటాం మనం. మాటలు