పుట:Mana-Jeevithalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అహంకారులైన ముగ్గురు ధర్మపరాయణులు

ఈ మధ్య ఒకరోజున అహంకారులైన ముగ్గురు ధర్మపరాయణులు నన్ను చూడటానికి వచ్చారు. మొదటాయన సన్యాసి. ప్రాపంచిక సుఖాల్ని త్యజించిన వాడు. రెండో ఆయన ప్రాచ్య సిద్ధాంతి. సౌభ్రాతృత్వంలో గొప్ప నమ్మకం ఉన్నవాడు. మూడో ఆయన అద్భుతమైన ఆదర్శ భావిసమాజం కోసం పాటుపడుతున్నవాడు. వారు ముగ్గురూ ఎవరికి వారు ఎంతో కష్టపడి తమతమ పనులను నిర్వహిస్తున్నారు. ఎదుటివారి అభిప్రాయాల్నీ, చర్యల్నీ చిన్నచూపు చూస్తూ తమకున్న విశ్వాసంతో ఎవరికి వారు శక్తిమంత మవుతున్నారు. ప్రతిఒక్కరూ తమతమ నమ్మకాల్ని గాఢంగా హత్తుకుంటూ, విచిత్రమైన నిర్దాక్షిణ్యంతో ఉన్నారు.

వాళ్ళునాతో, ముఖ్యంగా ఆదర్శ సమాజం కోసం పాటుపడుతున్నాయన, తాము నమ్మిన దానికోసం తమనీ, తమ స్నేహితుల్నీ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పైకి మాత్రం బిడియంగా, సౌమ్యంగా కనిపిస్తున్నారు, ముఖ్యంగా సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన కాని, వారి హృదయంలో కాఠిన్యం ఉంది. అది పై అధికారికి ఉండే విచిత్రమైన అసహన లక్షణం. వాళ్ళు కారణజన్ములు, ధర్మాలను వివరించగలవారు. వారికి అన్నీ తెలుసునని వారి నమ్మకం.

ఆ సన్యాసి గంభీరంగా మాట్లడుతూ, తను వచ్చే జన్మకోసం సంసిద్ధుడనవుతున్నానని చెప్పాడు. ఈ జీవితంలో పొందగలినదేమీ లేదట. ఈ ఐహిక సుఖాలన్నీ మిథ్య అని తెలుసుకుని సంసార మార్గాన్ని వదిలి పెట్టేశాడట. అయితే, ఆయనలో కొన్ని బలహీనతలున్నాయిట. ధ్యానం కేంద్రీకృతం కావటం కష్టమవుతోందిట. వచ్చే జన్మలోనైనా తప్పకుండా తన ఆదర్శం ప్రకారం సిద్ది పొందగలడుట.

ఆయన ఆసక్తి, శక్తీ అన్నీకూడా వచ్చేజన్మ కోసమే అంకితమైనట్లున్నాయి. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన ధోరణి ఎంతసేపూ రేపటిగురించీ, భవిష్యత్తు గురించీ. గతం ఉంది గాని, అది భవిష్యత్తుకి సంబంధించినంతవరకే అన్నాడాయన. ప్రస్తుతం అనేది కేవలం