పుట:MaharshulaCharitraluVol6.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

93

అప్పుడు దేవత లందఱు నాలోచించి యెట్లైన శుక్రాచార్యునివలన మృతసంజీవనీవిద్య గ్రహించి తేఁగలవాఁ డెవఁ డని యాలోచించి బృహస్పతిపుత్రుఁ డగు కచుఁడుదక్క నన్యుల కది సాధ్యము కాదని గ్రహించి యాతని నందులకై ప్రార్థించిరి.

దేవహితార్థియై కచుఁడు బయలుదేఱి వృషపర్వునినగరుచేరి యందు వేదాధ్యయనశీలుఁడై సకలదైత్యదానవగణోపాధ్యాయుఁ డయి యున్న శుక్రాచార్యునిం గని సాష్టాంగనమస్కార మొనరించి “ఆచార్యా! నేను బృహస్పతిపుత్తుఁడను, నన్నుఁ గచుఁడందురు. నేను నీకడ శిష్యుఁడనై యుండి విద్యలు నేర్వ వచ్చితిని. నీవు న న్ననుగ్రహింపు" మని ప్రార్థించెను. బాలుఁడయ్యును నియమవ్రతశీలుఁడై న వాఁడు, సుకుమారుఁడు, ప్రకాశవంతుఁడు, ప్రశాంతుఁడు, విశేషించి బృహస్పతియంతవాని పుత్రుఁడు వచ్చి శిష్యత్వ మంగీకరింపునుని ప్రార్థించిన నంగీకరింపకుండు టెట్లని శుక్రుఁడు పరమప్రితి నాతని నాదరించి యభ్యాగతపూజ లొనరించి యాత్మశిష్యు నొనర్చుకొనెను.

అది మొదలు శుక్రాచార్యుఁ డేపని చెప్పినను వెంటనే చేయుచు మనోవాక్కాయకర్మలచే గురుసేవ చేసి యాతనిమనస్సును, అంతకన్న మిన్న గా నాతనికన్న కూఁతురగు దేవయాని సున్నితహృదయమును కచుఁ డపహరింపఁ గలిగెను. కచుఁడు దేవయాని గీచినగీఁతదాటఁడు. ఆతడామెను హితమిత భాషణములచేతను, పుష్పఫలాదిదానములచేతను, నిరంతరము సంతోష పెట్టుచుండెను. ఇట్లు కొన్ని సంవత్సరములు జరిగెను. గురుశుశ్రూషా కౌశలమునఁ గచుఁడు గురునకుఁ బ్రియశిష్యుఁడు. గురుతనూజకుఁ బ్రియమిత్రుఁడు నయ్యెను.

ఇది చూచి రాక్షసులు సహింపలే రైరి. అందుచే నొకనాఁడు వనములో హోమధేనుపులంగాచు కచుని బట్టుకొని చంపి రాక్షసులు వాని శవము నొకచెట్టునకుఁ గట్టిపోయిరి. నాఁడు చీఁకటి పడుసరికి ఆవు లింటికి వచ్చినవి కాని, కచుఁడు రాఁడయ్యెను. కచుఁ డన్నఁ బంచ ప్రాణములుగా నున్న దేవయాని యాతనికొఱ కేడ్చుచుఁ దండ్రితో మొఱ పెట్టుకొనెను. శుక్రాచార్యుఁడు దివ్యదృష్టిని జూచి జరిగినదెల్ల గ్రహించి