పుట:MaharshulaCharitraluVol6.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

మహర్షుల చరిత్రలు


పన్నినకుట్రచే నిజము తెలిసికొనలేకపోయిరే కాని గురుద్రోహబుద్దికాని గురుగౌరవరాహిత్యముకాని రాక్షసుల కెంతమాత్రము లేదనియు, తన్నుఁ జూచియైన వారిని క్షమించి కాపాడుమని పదేపదే ప్రార్థించెను. రాక్షసలోకమంతయు వచ్చి శుక్రునిమ్రోల సాష్టాంగపడెను. సహజ దయార్ద్ర హృదయుఁ డగు శుక్రాచార్యుని కప్పటికి వారిపై జాలికలిగి నిజ శివతపశ్చర్యావృత్తాంతము, వరగ్రహణము వారికి సవివరముగాఁ దెలిపి ప్రహ్లాదునిమనుమఁడు, సకలగుణసంపన్నుఁడు, బలవిద్యా తేజస్వంతుఁడు, భక్తిసంపన్నుఁడు నగు బలిని వారికి నాయకు నొనరించి యాతనిచే ముల్లోకములు మరల నేలింతు నని చేసిన ప్రతిజ్ఞ మరలఁ జేసి తాను గడించినమంత్రరహస్యములను బలికి మిగిలినరాక్షస నాయకులకుఁ దెలిపెను.

శుక్రాచార్యుని కారణమున రాక్షసు లందఱు మహావీర్యవంతులై యుద్ధసన్నద్ధులై బలియాజమాన్యమున నవలీలగా ముల్లోకములను జయించిరి. వెంటనే శుక్రుఁడు బలిని చక్రపర్తి నొనరించి యింద్రాది దేవతలను బృహస్పతిని బాఱఁదోలించి పరిభవించి యిరువది నియుతముల యొక యర్బుదము నఱువది వేల సంవత్సరములు (20, 30,64, 0000) ఆతనిచే రాజ్య మేలించెను.*[1]

శుక్రునికూఁతురు దేవయానివృత్తాంతము

వృషవర్వుఁ డను రాక్షసరాజు ఆచార్యుఁ డగుశుక్రుని మహాభక్తి గౌరవములతో భజించుచు, నాతనిం దనపురమున రాజప్రాసాదమునఁ బెట్టుకొని యాతనిఁ దనకంటె నెక్కుడుగాఁ బూజించుకొనుచుండెను ఇంత వినయవిధేయతలఁ జూపుశిష్యునివల్ల గురువగు శుక్రాచార్యుఁడునం దయాపరుఁడై యాతనితలలో నాలుకవలె మెలఁగుచుండెను. వృషపర్వుఁడు మహాయుద్ధముల నొనరించి దేవతల నేడ్పించుచుండెను. యుద్ధములో మృతు లై నరాక్షసుల నెల్ల రను మృతసంజీవనీ విద్యచే గురువు బ్రదికించుచుండుటచే రాక్షసుల జయింప దేవతలకు సాధ్యము కాదయ్యెను.

  1. *పద్మపురాణము. సృష్టిఖండము. బ్రహ్మాండ పురాణము