పుట:MaharshulaCharitraluVol6.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

మహర్షుల చరిత్రలు


మని యడిగెను. "దేవా! నిన్ను భర్తగ వరించి యీసేవలు చేసితిని. పదివేలసంవత్సరములు నీవు నాతో సుఖించువర” మిమ్మని ప్రార్థించెను. శుక్రుఁ డందుల కంగీకరించి యామెకొక మనోహరకేళిగృహము నిర్మించి యొరు లెవ్వరికిని గానరానివిధమున నామెతోఁ గామసుఖము లనుభవించుచుఁ బదివేలసంవత్సరము లుండిపోయెను.

ఈలోఁగా శుక్రుఁ డెంతటికిని దిరిగిరాకపోవుటకుఁ గారణ మెఱుంగక రాక్షసు లందఱు ధైర్యహీనులై తేజోహీనులగుచుండిరి. వారి నింకను జెఱుప నిదే సమయమని యెంచి బృహస్పతి శుక్రవేషమును ధరించి రాక్షసులకడకు వచ్చిచేరెను. అతఁడు నిజముగఁ దమగురువే యనుకొని రాక్షసు లపరిమితానందమున నాతనిని స్వీకరించి కులగురువుగాఁ బూజించుచుండఁగా వేయిసంవత్సరములు గడచెను. అప్పటికి శుక్రుఁడు జయంతికి గామసంతృప్తి పరిపూర్ణముగా నొసంగి యా మెవలన నలువురుకుమారులను, ఒక కొమార్తెను గాంచెను. చండుఁడు, అమర్కుఁడు, త్వష్ట, ధరాత్రుఁడు అనునలువురు కొడుకులను, దేవయాని యనుకూఁతును దీసికొని జయంతిని బంపివేసి శుక్రుఁడు రాక్షసనగరమునకు విచ్చేసి తనయాగమనవార్త శిష్యులకుఁ దెలిపెను. ఎవ్వరును వచ్చి యాతనిని గౌరవింపరై రి. ఇదేమని యాతఁడు రాక్షస సభ కేగి చూడ నచట శుక్రవేషమున నున్న బృహస్పతి కనిపించెను. శుక్రుఁ డాతనిమోసమును గ్రహించి కోపముతో " ఓరీ! నేను లేని సమయముఁ గనిపెట్టి నా శిష్యుల నిటులు మోసగింతువా ? వారు నిన్ను గుర్తెఱిఁగినతత్క్షణము నిన్నుఁ జీలికలు వాలికలు చేయుదురు. ఆసనము దిగి వెంటనే పొ"మ్మని హుంకరించెను. బృహస్పతి యాతనిం జూచి "ఓరీ ! ఇదివఱకు ధనతస్కరులనే మే మెఱుఁగుదుము కాని రూపతస్క రుల నెఱుంగము. ఇపుడు నిన్నుఁ జూచితిమి. చాలు. నిన్ను నమ్ము వా రెవరును లేరు. పొ"మ్మని చెప్పెను. అపుడు నిజమైనశుక్రుఁడు రాక్షసుల నుద్దేశించి జరిగినమోస మంతయు వివరించి చెప్పెను. కాని వా రందఱు దొంగశుక్రుని నిజమైనశుక్రునిగాఁ దలఁచినవా రగుట నీతని మాటలను బాటింపరైరి. అంతేకాదు. బృహస్పతిమాటలను బట్టి యాతని మెడపట్టి గెంటివేసిరి.